రూ.1,043 కోట్లు.. | - | Sakshi
Sakshi News home page

రూ.1,043 కోట్లు..

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకంలో వేలాది ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. తాజాగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు కలిపి 48,787 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 27,477 (56.32 శాతం) ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో రూ.1,043.48 కోట్లు ఖర్చు చేసినట్లు అసెంబ్లీలో సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇంత మొత్తం వ్యయం జరిగినప్పటికీ మంజూరైన ఇళ్లలో సగానికి కొద్దిగా మించి మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది.

14,511 ఇళ్లు గ్రౌండింగ్‌ తర్వాతే..

ఉమ్మడి వరంగల్‌లో 41,988 ఇళ్లు గ్రౌండింగ్‌ అయినప్పటికీ వాటిలో 27,477 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే గ్రౌండింగ్‌ అయినా ఇంకా 14,511 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోలేదు. మరో 6,799 ఇళ్లు మంజూరైనప్పటికీ గ్రౌండింగ్‌కు రాలేదు. దీంతో మంజూరు చేసిన ఇళ్లను త్వరగా గ్రౌండింగ్‌కు తీసుకురావడంతోపాటు ఇప్పటికే పునాదులు పడిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

పెండింగ్‌ బిల్లుల విడుదలకు

వన్‌ టైమ్‌ క్లియరెన్స్‌..

ఇందిరమ్మ ఇళ్లలో నిర్దేశించిన స్లాబ్‌ ఏరియాను మించి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బేస్‌మెంట్‌ చెల్లింపులు నిలిపివేస్తున్నారా? అనే అంశంపై అసెంబ్లీలో ప్రశ్న వచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ నిబంధనలను సడలిస్తూ, పెండింగ్‌ బిల్లుల విడుదలకు వన్‌ టైమ్‌ క్లియరెన్స్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఎవరైతే బేస్‌మెంట్‌ స్థాయి నిర్మాణం చేసుకున్నారో వారి ఇళ్లను ఎల్‌3 నుంచి ఎల్‌1 కేటగిరిలోకి మార్చి.. వెంటనే బిల్లులు చెల్లించనున్నారు. దీంతో బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం తగ్గి వేగం పుంజుకునే అవకావం ఉంటుందని గృహనిర్మాణ సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. తాజా నిర్ణయాల అమలుతో ఇళ్ల నిర్మాణం వేగం పెరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకయిన ఖర్చు

ఆరు జిల్లాల్లో 48,787 మంజూరు.. 27,477 మాత్రమే పూర్తి

68.60శాతంతో జనగామ టాప్‌.. 44.84శాతంతో భూపాలపల్లి లాస్ట్‌

ప్రభుత్వం తాజా నిర్ణయాలతో

వేగం పెరిగేనా?

జనగామ జోరు.. భూపాలపల్లి వెనుకంజ

జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణం పూర్తి శాతంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.

జనగామ జిల్లా 68.60 శాతంతో ముందంజలో ఉంది. ఇక్కడ 6,071 ఇళ్లు మంజూరు కాగా 4,165 ఇళ్లు పూర్తయ్యాయి.

మహబూబాబాద్‌ 63.16 శాతంతో రెండో స్థానంలో ఉంది. 11,218 మంజూరైన ఇళ్లలో 7,085 ఇళ్లు పూర్తయ్యాయి.

ములుగు 59.79 శాతం, హనుమకొండ 54.82 శాతం పూర్తి చేశాయి.

ఇక వరంగల్‌లో 47.64 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

జయశంకర్‌ భూపాలపల్లి 44.84 శాతంతో చివరి స్థానంలో ఉంది. అక్కడ 5,076 ఇళ్లు మంజూరు కాగా 2,276 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement