రేగొండ: వరిలో నాణ్యమైన విత్తనోత్పత్తితో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి బాపురావు అన్నారు. వరి విత్తనోత్పత్తిపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మదన్ మోహన్ రెడ్డి, వరంగల్ వృక్ష ప్రజనన శాస్త్రవేత్త గొన్య నాయక్ శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. విత్తనోత్పత్తికి అనుకూలమైన భూమిని ఎంపిక చేసి, గత పంట అవశేషాలు లేకుండా పొలాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. పంటలో తెగుళ్ల నివారణ కోసం సమగ్ర యాజమాన్యం పాటించాలన్నారు. విత్తనోత్పత్తిలో పుష్పించే దశలో కోతకు ముందు పొల పరిశీలన ద్వారా ఇతర మొక్కలను తొలగించి జన్యు స్వచ్ఛతను కాపాడుకోవచ్చని తెలిపారు. కోత అనంతరం విత్తనాన్ని శుభ్రపరచి, తేమను తగ్గించి, శాసీ్త్రయ పద్ధతిలో నిల్వ చేయడం ద్వారా విత్తన నాణ్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయంతో పాటు స్థాని కంగా నాణ్యమైన విత్తనాల లభ్యత పెరుగుతుందని బాపురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి వల్యానాయక్, మండల వ్యవసాయాధికారి వాసుదేవారెడ్డి. ఏఈఓలు గోవర్ధన్, భరత్, ప్రవళిక, రైతులు పాల్గొన్నారు.


