నిమజ్జనానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వేళాయె

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

ములుగు: నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఊరూవాడ కొలువుదీరిన వినాయకులు నేడు నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాయి. గణేశ్‌ నిమజ్జన వేడుకల సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్‌ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శోభాయాత్ర నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో ప్రత్యేకంగా గుర్తించిన 50 ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది.

815 విగ్రహాలకు ప్రత్యేక పూజలు

జిల్లాలోని 171 గ్రామ పంచాయతీలతో పాటు ములుగు మున్సిపాలిటీ పరిధిలో యువజన సంఘాలు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు కలిసి మొత్తంగా 815 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈనెల 14న ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులను ప్రతిష్ఠించుకుని నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నేడు(బుధవారం) వినాయకుడిని అత్యంత వైభవంగా ఊరేగిస్తూ నిమజ్జనం చేయనున్నారు.

50 చెరువుల ఎంపిక

వినాయక నిమజ్జనానికి పోలీసు శాఖ 50 ప్రాంతాలను ఎంపిక చేసింది. పోలీసులు సూచించిన చెరువుల్లోనే నిమజ్జనం చేసే విధంగా ఆయా ప్రాంతాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ములుగు మండల పరిధిలోని తోపుకుంట, బొగ్గుల వాగు, ఎర్రచెరువు, పెద్ద చెరువు, ఊర చెరువు, రాళ్లమాటు, నల్లకాలువ, వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని మారెడుగొండ చెరువు, ఊరుముగుట్ట చెరువు, ఎర్ర చెరువు, వొగరు చెరువు, జవహర్‌నగర్‌ చెరువు, కొత్తచెరువు, గుడికుంట, మోరంచవాగును ఎంపిక చేశారు. అలాగే గోవిందరావుపేట మండల పరిధిలోని దయ్యాలవాగు, గౌరారం చెరువు, రంగాపూర్‌ చెరువు, తాడ్వాయి మండలంలో ఎలుబాక వాగు, జంపన్నవాగు, పెద్ద చెరువు, ముల్లకట్ట, నర్సయ్యకుంట, సాకిరితోగు వాగు, ఊరట్టం వాగు, రామన్నగూడెం, బయ్యక్కపేటవాగు ఉంది. అలాగే ఏటూరునాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి, రాంనగర్‌ బ్రిడ్జి, కన్నాయిగూడెం మండలంలో దేవాదుల, తుపాకులగూడెం బ్యారేజీ, మంగపేట మండలంలో గోదావరి నది, నర్సింహాసాగర్‌ రిజర్వాయర్‌, వాడగూడెం ఉంది. అలాగే వెంకటాపురం(కె) మండలంలో బొళ్లకట్ట వాగు, జిన్నెలవాగు, వాజేడు మండలంలో చీకుపల్లి వాగు, ముల్లకట్ట బ్రిడ్జి, బొమ్మనపల్లితో కలిపి 50 ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలని అధికారులు గణేశ్‌ ఉత్సవ కమిటీలకు, మండపాల నిర్వాహకులు, ఆర్గనైజర్లు, యువతకు సూచిస్తున్నారు.

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

ములుగులోని తోపుకుంట వద్ద విద్యుత్‌శాఖ తరపున చేసిన ఏర్పాట్లను టీజీఎన్‌పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ గౌతమ్‌రెడ్డి పరీశీలించారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని నిరంతరం విద్యుత్‌ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో గణనాథుల నిమజ్జనానికి

ఏర్పాట్లు పూర్తి

171 జీపీలు.. 815 విగ్రహాలు

300 మంది పోలీసులతో బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement