ఏటూరునాగారం: ఆదివాసీల చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఐటీడీఏ వరకు మార్చ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అటవీహక్కుల చట్టాలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐటీడీఏలు ఏర్పాటైన తర్వాత ఒక ప్రత్యేక బైలాను రూపొందించారని తెలిపారు. దాని ప్రకారం ఐటీడీఏలో 29 శాఖల అధికారులు ఐటీడీఏ ఉండాల్సి ఉండగా కేవలం ఐదు, ఆరు శాఖల అధికారులే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మిగతా శాఖలను విలీనం చేయడం బాధాకరమన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు రీసర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. గోదావరి నదిలో ఇసుక తవ్వకాల్లో ప్రభుత్వ అధికారులు చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోకు ఆదివాసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఏజెన్సీలోని షెడ్యూల్ ట్రైబ్స్‌కు ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తామని, ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీలో తహసీల్దార్లతో సమీక్షించి ప్రతినెలా పరిష్కారాలను చూపుతామని వివరించారు. బ్యాంకుల ద్వారా గిరిజనులకు రుణాలు ఇప్పించేందుకు తమవంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీ ప్రజలు, నాయకులు రాస్తారోకోను విరమించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్, జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, జాతీయ అధ్యక్షుడు విజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు పులుశ బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడిగ నాగేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్‌రావు, జిల్లా అధ్యక్షుడు నల్లబోయిన లక్ష్మణ్‌రావు, నాయకులు గణేశ్, సిద్ధబోయిన కార్తీక్, కబ్బాక లక్ష్మణ్, దబ్బగట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
అరుణ్‌కుమార్
ఐటీడీఏ ముట్టడికి
భారీగా తరలివచ్చిన ఆదివాసీలు


