ములుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు అన్నారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతితో కలిసి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహారావు మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. నల్ల దుస్తులు ధరించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, గిరిజనులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకుంటూ అధికార పార్టీ కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తు కల్పించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. నిరసన కార్యక్రమంలో కౌన్సిలర్లు బైకాని సునిత, లక్ష్మి, సర్పంచ్ శ్రీలత, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
లక్ష్మీనరసింహారావు


