● డీఈఓ సిద్దార్థరెడ్డి
ములుగు: దివ్యాంగ విద్యార్థులు సంకల్పంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగు భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తూ, చిన్న వయసులోనే వైకల్యాన్ని గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. శిబిరానికి 90 మంది విద్యార్థులు హాజరు కాగా, 64 మందిని ఉచిత ఉపకరణాల కోసం ఎంపిక చేసినట్లు సమగ్ర శిక్ష ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గుళ్లపెల్లి సాంబయ్య తెలిపారు. త్వరలో వారికి ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు మండల కేంద్రాల్లోని ఐఈఆర్పీలు, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ సైకం శ్రీనివాసరెడ్డి, అలింకో డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.


