ఏటూరునాగారం: ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న తెలంగాణ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలోని విద్యార్థులు సోమవారం నీటికోసం రోడ్డెక్కారు. మండల కేంద్రంలో వెంకటాపురం(కె), వాజేడుకు చెందిన కళాశాలను నెల రోజుల క్రితం ఏటూరునాగారం ఐటీడీఏ ఎదురుగా ఉన్న పోస్టు మెట్రిక్ హాస్టల్ నూతన భవనంలోకి తరలించారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 250 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటున్నారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ భవనానికి సరైన నీటి వసతి లేదు. ఈ విషయాన్ని వార్డెన్ కిర్మయికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు గురిచేస్తోంది. నెల రోజుల నుంచి ఓపిక పట్టిన విద్యార్థినులు సోమవారం బయటకు వచ్చి ఐటీడీఏ ఎదుట ధర్నాకు దిగారు. నెల రోజులుగా నీటితో పాటు పలు సమస్యలపై ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం అసహనం వ్యక్తం చేశారు. మూడు అంతస్తుల మీదకు బకెట్లతో నీటిని పట్టుకొని బాత్‌రూమ్, స్నానాలకు మోసుకొని పోవాల్సిన దుస్థితి ఉందన్నారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని గగ్గోలు పెట్టారు. గంట తర్వాత అధికారులు స్పందించి వారిని నచ్చజెప్పి హాస్టల్‌కు తరలించారు. ఈ విషయంపై బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు కళాశాల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థినులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వార్డెన్‌ను వెంటనే తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అన్నారు.
సమస్య పరిష్కరించాలని
ఐటీడీఏ ఎదుట ధర్నా


