సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్‌లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.
కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం..
ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్‌రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది.
మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ
సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
హైకమాండ్ వద్దకు ‘హస్తం’ పేచీ..
ఇప్పటికే షోకాజ్ నోటీసు, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్‌పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్‌లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది.
త్వరలో మీడియా ముందుకు సురేఖ?
ఇదిలా ఉండగా.. శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్‌చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.
ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు
కాంగ్రెస్ పంచాయితీ
సురేఖ వివరణపై సంతృప్తి చెందని
పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక
సీఎల్‌పీలో అత్యవసరంగా భేటీ అయిన
ఉమ్మడి వరంగల్ నేతలు
మంత్రిపై చర్యలు తీసుకోవాలని
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్
అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ


