ములుగు: అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన రైతు బీమా పథకంపై అయోమయం నెలకొంది. ఈనెల 13వ తేదీ వరకు బీమా గడువు తీరిపోయిన రెన్యూవల్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అకాల మరణంతో పెద్ద దిక్కు దూరమైన కుటుంబానికి భరోసాగా నిలిచిన ఈ పథకానికి బ్రేక్ పడనుందనే సందేహం నెలకొంది. కాగా రైతులతోపాటు సామాన్య కుటుంబాలకు బీమా వర్తించేలా ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
18 నుంచి 59 ఏళ్లలోపు వారికి..
రైతులు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా అందించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 నుంచి 59 ఏళ్లలోపు రైతులు ప్రమాదవశాత్తు లేదా సాధారణ మరణం సంభవించినా పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ప్రతీ రైతుకు ఆరంభంలో రూ.2,271లు ప్రీమియం చెల్లించగా, ప్రస్తుతం ప్రీమియం రేట్లు పెరగడంతో ఒక్కో రైతుకు రూ.3,556 చొప్పున బీమా కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతీ ఏటా ఆగస్టు 13వ తేదీలోగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేస్తుంది. ఈనెల 13వ తేదీ వరకు బీమా గడువు తీరినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో రైతు బీమాపై సందేహం నెలకొంది.
జిల్లాలో 41,013 మంది రైతులు
జిల్లా వ్యాప్తంగా రైతు బీమా పథకంలో 41,013 మంది రైతులు ఉన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు 1,874 మంది రైతులు మృతిచెందగా 1,853 మందికి రూ.5 లక్షల చొప్పున రూ.92.65 కోట్లను రైతు కుటుంబాలకు చెల్లించారు. ఇంకా 21 మంది రైతులకు రూ.1.05 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రీమియం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో ఆగస్టు 13వ తేదీలోపు మరణించిన రైతు కుటుంబాలకు మాత్రమే పాత విధానం ప్రకారం బీమా డబ్బులు అందనున్నాయి. అయితే ఆగస్టు 13 తర్వాత మరణించిన రైతుల కుటుంబాల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
అందరికీ వర్తించేలా ఇందిరమ్మ బీమా!
రైతు బీమా స్థానంలో సామాన్య ప్రజలు, రైతులకు వర్తించేలా ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పథకం అమలు తీరుతెన్నులపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం ద్వారా ఇంటి పెద్ద మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది.
సమాచారం లేదు
రైతు బీమా రెన్యూవల్‌పై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు మృతిచెందిన 1,853 రైతులకు రైతు బీమా పథకం ద్వారా పరిహారం బాధిత కుటుంబ ఖాతాల్లో జమ చేశాం. ఇంకా 21 మంది రైతులకు బీమా డబ్బులు అందించాల్సి ఉంది. ఇందిరమ్మ బీమా పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు.
–సురేష్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
ఎనిమిదేళ్ల క్రితం
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం
ఈ నెల 13వ తేదీ వరకే
తీరిపోయిన గడువు
జిల్లాలో 41,013 మంది అన్నదాతలు
జిల్లాలో మృతిచెందిన రైతుల వివరాలు
మరణించిన రైతులు : 1,874
చెల్లించిన డబ్బులు : రూ. 9.65 కోట్లు
చెల్లించాల్సినవి : రూ.1.05కోట్లు


