ములుగు రూరల్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది నియామకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని భూపాలపల్లి, ములుగు జిల్లా రిజనల్ కోఆర్డినేటర్ పద్మిని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్హతల సంబంధిత సబ్జెక్టులో బీఈడీ పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయి ఉండాలని, డిగ్రీ, పీజీ పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించి ఉన్నవారు అర్హులన్నారు. పీజీటీ హిందీ, గణీతం, జూనియర్ లెక్చరర్ ఇంగ్లిష్, జువాలజీలో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీన ఏటూరునాగారం స్పోర్ట్స్ పాఠశాలలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. డెమో, మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9959072997, 8309452015 నంబర్లను సంప్రదించాలన్నారు.
మలేరియా నివారణపై అవగాహన కల్పించాలి
వెంకటాపురం(కె): మలేరియా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా సెంట్రల్ టీమ్ సభ్యులు లక్ష్మణ్, అశోక్, సురేశ్‌లు తెలిపారు. మండలంలో శుక్రవారం మలేరియా నివారణ నియంత్రణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వైద్యశాలలో ఉన్న మలేరియా వ్యాధిగ్రస్తుల రికార్డును పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామాల్లో మలేరియా అనుమానిత కేసులను సకాలంలో గుర్తించి రక్తపూత సేకరణ పరీక్షలను నిర్వహించాలన్నారు. పాజిటివ్ తక్షణమే చికిత్స నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి యుధిస్టర్, సబ్ యూనిట్ అధికారి నర్సింహారావు, హెఈఓ కోటిరెడ్డి, సిబ్బంది గణేష్, రాఘవులు, భాస్కర్ తదితరులు ఉన్నారు.
వివాదరహిత
జీవితం గడపాలి
భూపాలపల్లి అర్బన్: పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృథా కావడంతో పాటు తీవ్రంగా నష్టపోతారని ప్రతి ఒక్కరూ వివాద రహిత జీవితాలను గడపాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా మున్సిపాలిటీ పరిఽధిలోని మంజూర్‌నగర్, మహిబూబ్‌పల్లిలో శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు, ప్రామిసరీ నోట్, కుటుంబ, సివిల్ తదితర వివాదాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ.. కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. వివాదాలకు దూరంగా జీవించాలని కోరారు. న్యాయ సహాయం కోసం నల్సా టోల్‌ఫ్రీ నంబర్ 15100ను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, మహిత, వెంకటేష్, రాజ్‌కుమార్, గౌతమి, కార్తీక్ పాల్గొన్నారు.


