వాజేడు: మండలపరిధిలోని ముత్తారం కాలనీకి చెందిన జాడి రాంబాబు (46) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం వాజేడు పోలీస్‌స్టేషన్‌లో వెంకటాపురం (కె) సీఐ ముత్యం రమేశ్, ఎస్సై జక్కుల సతీశ్ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈనెల 15 (శనివారం)న జాడి రాంబాబు రంపంతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో హత్య చేసినట్లు అనుమానం కలగడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జాడి రాంబాబుకు అన్న, ముగ్గురు అక్కలు ఉన్నారు. ఇందులో ఒక అక్క, అన్నకు వివాహం కాగా మిగతా ఇద్దరు అక్కలు రాంబాబుతోనే ఉంటున్నారు. రాంబాబు నిత్యం ఇద్దరి భార్యలతో గొడవ పడుతుండటంతో వారిద్దరు పుట్టింటికి వెళ్లిపోయారు. వారిని తీసుకురావాలని ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కలతో గొడవపడుతుండటంతో వారు కూడా మండపాల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాంబాబు కూతురు రమ్య కొడుకు పుట్టు వెంట్రుకల కోసం మేనమామ వరుస అయిన ప్రవీణ్‌ను పంపించాలని పదిరోజుల క్రితం రజిత (రాంబాబు భార్య) జానకిరావుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో జానకిరావు ప్రవీణ్‌ను రజిత ఇంటికి పంపించాడు. తన కొడుకును ఎందుకు పంపించావు, వెంటనే తీసుకురావాలని రాంబాబు తన అన్న జానకిరావుతో గొడవ పెట్టుకోవడంతో పాటు తీవ్రంగా గాయపరిచాడు. ఇది మనుసులో పెట్టుకున్న జానకిరావు రాంబాబును హత్య చేయాలని భావించి ఈనెల 15న శనివారం రాత్రి మద్యం సేవించి వచ్చి రాంబాబు పడుకున్న సమయంలో గడ్డి కోసే కొడవలితో తల, గొంతుపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా అతని (రాంబాబు) చేతిలో రంపం ఉంచి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టి జానకిరావును అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. దీంతో జానకిరావును శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు


