ములుగు: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద హెలిపాడ్‌ను సిద్ధం చేశారు. గట్టమ్మ ఎదురుగా నిర్మించిన పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పైలాన్, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీంతో పాలన మరింత వేగం కానుంది. అలాగే, మేడారం వనదేవతల ప్రాంగణాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, విద్యుత్, జనరేటర్ సదుపాయం, తాగునీటి వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్యం, సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్, విద్యుద్ధీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అదే విధంగా సీఎం రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, వీఐపీ వాహనాల పార్కింగ్, ప్రజలు, అధికారులు కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు, బారికేడ్లు, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక, వైద్య బృందాలు, అంబులెన్స్ తదితర అత్యవసర సేవలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.
ఏర్పాట్ల పరిశీలన
సీఎం పర్యటనలో లోటుపాట్లకు తావులేకుండా ప్రతీశాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్, మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రాంగణాన్ని ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రతీ ప్రాంతంలో భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.
మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి మేడారం చేరుకునే హెలిపాడ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడంతో పాటు హెలిపాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ వనదేవతల ప్రాంగణం వరకు రహదారులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. వనదేవతల దర్శనం, ప్రత్యేక పూజలు చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలపై సూచనలు చేశారు. వనదేవతల ప్రాంగణాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల
మీదుగా కలెక్టరేట్ ప్రారంభం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పరిశీలించిన మంత్రి సీతక్క


