విశాలంగా.. సులభంగా..
భక్తుల రద్దీకి తగ్గట్టుగా..
మేడారం క్యూలైన్ల డిజైన్‌లో మార్పు
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు క్యూలో ఇబ్బందులు పడకుండా అధికారులు ఎత్తు, వెడల్పు పెంచారు. ఈ సారి అధికారులు పెద్ద ఎత్తున క్యూలైన్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ద్వారా మ్యాపింగ్ చేయించారు. జంపన్నవాగు నుంచి వచ్చే భక్తులు నేరుగా క్యూలైన్ వద్దకు వెళ్లేలా మ్యాపింగ్ చేయించారు. మరొక దారి బస్టాండ్ నుంచి వచ్చే భక్తులు క్యూలైన్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉన్న క్యూలైన్ మాదిరిగానే ఈ సారి కూడా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఎత్తు ఎక్కువగా, విశాలంగా ఉండేలా పందిళ్లను ఏర్పాటు చేసి లైన్లను మరిన్ని పెంచారు. దీంతో ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా విశాలంగా, విరివిరిగా దర్శనానికి వెళ్లేలా సులభమైన మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ దర్శనానికి కూడా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
బెల్లం(బంగారం) కౌంటర్లు ఏవీ?
అమ్మవార్లకు సమర్పించిన బంగారం (బెల్లం) ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు గద్దెల వద్ద పడిగాపులు పడుతున్నారు. బెల్లం ప్రసాదాన్ని స్వీకరించడానికే ఎక్కువ సమయం భక్తులు కేటాయించడంతో గద్దెల ప్రాంగణంలోనే భక్తులు నిలిచిపోవాల్సి వస్తోంది. దీంతో గంటల తరబడి భక్తులు గద్దెల చుట్టూ గుమికూడడంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు గద్దెల వద్దకు వచ్చేందుకు ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే భక్తుల రద్దీ ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జాతరలోనైనా ప్రసాదం (బెల్లం) పంపిణీ కౌంటర్లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను విశాలంగా చేయడంతో ఒకేసారి వేలాది మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోకుండా వెంటవెంటనే దర్శనం చేయించే విధంగా ప్రవేశం, బయటకు వెళ్లే ప్రదేశాలను మరింత విస్తరిస్తున్నారు. దీంతో వేలాది మంది భక్తులు దర్శించుకొని ఒకేసారి బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో క్యూలైన్లలో ఒత్తిడి, రద్దీ తగ్గనుంది.
ఎత్తు, వెడల్పు ఎక్కువగా
ఉండేవిధంగా ఏర్పాట్లు
పంచాయతీరాజ్ శాఖ
ఆధ్వర్యంలో మ్యాపింగ్
భక్తులకు ఇబ్బందులు లేకుండా
దర్శనాలు


