రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి
ములుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ టీఎస్.దివాకర పిలుపునిచ్చారు. ఈ మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆయన కలెక్టరేట్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఉంటాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని సూచించారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి తద్వారా వారి తల్లిదండ్రులకు వివరించేలా చూడాలన్నారు. ఇందుకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా, డ్రంకెన్ డ్రైవ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడపవద్దని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో అధికారులు విద్యార్థులను విస్తృతంగా భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్లాక్ స్పాట్స్ వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, ఆర్టీఓ శ్రీనివాస్, ఏఎంవీఐ వినోద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్
పాటించాలి
కలెక్టర్ టీఎస్.దివాకర


