మహాజాతర పనుల్లో వేగం పెంచాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర పనుల్లో వేగం పెంచాలని, ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులను కలెక్టర్ దివాకర శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెలవు రోజులలో అధిక సంఖ్యలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనుల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మోడల్ క్యూలైన్ నిర్మాణాలు పరిశీలించి క్యూలైన్లలో ఉండే భక్తులకు తాగునీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలోని భారీ రాతి స్తంభాలపై త్వరగతిన బ్రాకెట్లను ఏర్పాటు చేయాలని, ఆలయ ఫ్లోరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్ స్తంభాలను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ వీరస్వామి, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేష్, తహసీల్దార్ సురేష్ బాబు, సంబంధిత గుత్తేదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
కలెక్టర్ టీఎస్.దివాకర


