పొగాకు ఉత్పత్తులు సేవించొద్దు
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
● జిల్లా కేంద్రంలో నో టొబాకో డే అవగాహన ర్యాలీ
ములుగు: పొగాకు ఉత్పత్తులలో 69 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయని, పొగాకు ఉత్పత్తులను సేవించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వరల్డ్ నో టొబాకో డే అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గుట్కా, తంబాకు, సిగరేట్, బీడీ తాగడం ద్వారా నికోటిన్ అనే పదార్థం మెదడుపై పనిచేసి బానిసలుగా మారుస్తుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం చట్టరీత్యా నేరమన్నారు. ఉల్లంఘించిన వారికి రూ. 2వేల జరిమానాతో పాటు జైలుశిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. పొగాకుకు దూరంగా ఉందాం–ఆరోగ్యంగా జీవిద్దాం, గుట్కాలు తినొద్దు–ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఒకరు పొగాకు తాగడం ద్వారా ఇతరులకు హాని కలుగుతుందని వివరించారు.కార్యక్రమంలో జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్ పవన్‌కుమార్, డాక్టర్లు శ్రీకాంత్, నాగ్‌అన్వేష్, డెమో సంపత్, డీపీఎంఓ సాంబయ్య పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో..
జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు సేవించడం ఆరోగ్యానికి హానికరమన్నారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులతో పొగాకు రహిత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల్ మహేందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు.


