మంగపేట: మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గొత్తికోయలు అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని తిమ్మాపురం ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 60కుటుంబాలు, ప్రాజెక్టునగర్‌లో 22, శాంతినగర్ 18, కేశపురం 20, పాయిగూడెం 18, రాళ్లగుంపు 20, ఎస్టీ కాలనీకి చెందిన 4కుటుంబాలను ఆయన ఆదివారం సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రాబిన్ ఫుడ్, సీజేఐ వారి సహకారంతో ఆయా గూడేల్లోని గొత్తికోయలకు సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరుకూడా మావోయిస్టులకు సహకరించవద్దన్నారు. గూడేలకు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మిర్చి కూలీల ముసుగులో మావోయిస్టులు వచ్చి విధ్వంసాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. గూడేలకు అపరిచిత వ్యక్తులు వచ్చినా, అటవీ ప్రాంత పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. మావోయిస్టులకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, స్థానిక ఎస్సై సూరి, రాబిన్‌హుడ్, సీజేఐ సిబ్బంది, ట్రెయినీ ఎస్సైలు మహేష్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ