ఆదివాసీ చిత్రాలపై పునఃపరిశీలించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాతి స్తంభాలపై చెక్కిన ఆదివాసీ చిత్రాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని తుడుందెబ్బ కమిటీ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు. తుడుందెబ్బ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాతి స్తంభాల చెక్కిన చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులకు నిధులు కేటాయించి, ఆదివాసీల చరిత్రను ప్రపంచానికి తెలిసేలా పనులు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులుగా ఉంటూ ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలను అవలంభిస్తున్నారని, అటువంటి విధానం కలిగిన ఆదివాసీలకు హిందుత్వ మూలాలు అంటగట్టే ప్రయత్నం సరికాదని అభిప్రాయపడ్డారు. ముఖద్వారం మీద స్వస్తిక్ గుర్తు, పగిడిద్దరాజు గద్దెల వద్ద రాతి చిత్రాలపై ఉన్న శంఖు, చక్రాలు, తిరునామాల చిత్రాలను సంస్కృతిలో పెట్టడం ద్వారా ఆదివాసీల చరిత్రను భవిష్యత్ తరానికి తప్పుగా తెలియజేసినట్టేనన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ చిత్రాలపై పునఃరిశీలన చేసి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాల్లో పెద్దమనుషులు, పడిగెలు కుట్టె కళాకారులు, కోయ పురాణం చెప్పే కోయ కళాకారుల ప్రాతినిథ్యం ఉంటుందని.. నిర్మాణంలో వారి భాగస్వామ్యం లేకపోవడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆదివాసీ రాజకీయ జేఏసీ చైర్మన్ వాసం రామకృష్ణ, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, తుడుం దెబ్బ జాతీయ కోకన్వీనర్లు రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు వట్టం కన్నయ్య, పూనెం శ్రీను, పాయం జా నకి, చిట్టిబాబు, జనార్ధన్, జిల్లా అధ్యక్షుడు చందా మహేష్, కార్యదర్శి కాపుల సమ్మయ్య పాల్గొన్నారు.
తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య


