ఏటూరునాగారం: తాగడానికి నీళ్లు, విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వాజేడు మండల పరిధిలోని పూసూరు గ్రామ సమీపంలోని రెవెన్యూ భూమిలో గుడిసెలు వేసుకున్న గుడిసెవాసులు సోమవారం వాజేడు నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు పాదయాత్రగా ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట సీపీఎం నాయకులు, గిరిజనులు కలిసి ధర్నాకు దిగారు. ఈ పాదయాత్రకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హాజరై మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు తాగునీరు, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అనంతరం సీపీఎం వాజేడు మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు మాట్లాడుతూ ఆదివాసులు, పేదలు తాగునీటి కోసం 20 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఉందంటే సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల కష్టాలు, సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు అందజేశారు. కార్యక్రమంలో దావూద్, చిట్టిబాబు, దామోదర్, చిరంజీవి, రాజేష్, దేవయ్య, కృష్ణబాబు, చంద్రశేఖర్, సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పూసూరు గ్రామ సమీపంలోని
గుడిసెవాసుల వేడుకోలు
వాజేడు నుంచి ఐటీడీఏ వరకు
ఖాళీ బిందెలతో ర్యాలీ, ధర్నా
తాగునీరు.. విద్యుత్ ఇవ్వండి


