కరకట్ట కలేనా..? ముందుకు సాగని నిర్మాణ పనులు | Sakshi
Sakshi News home page

కరకట్ట కలేనా..? ముందుకు సాగని నిర్మాణ పనులు

Published Fri, Jun 23 2023 1:28 AM

- - Sakshi

మంగపేట: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణం కలగానే మిగులుతుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచగా ఉన్న కరకట్ట నిర్మాణంపై ఒక అడుగుముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. అధి కారులు, ప్రజాప్రతినిధులు. ప్రతి ఏటా వర్షాకాలంలో వరద కారణంగా గోదావరి ఒడ్డు వెంట గల వేలాది ఎకరాల సాగుభూములు గోదావరిలో కలిసిపోతోన్నాయి. దీంతో 30 ఏళ్ల క్రితం నుంచి గోదావరి ఒడ్డు వెంట రైతులుకు వరద కోత గుండెకోతగా మారింది. గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోతకు గురి కాకుండా ఉండేందుకు 2008లో అప్ప టి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్యాకేజీ వర్క్‌ కింద రూ.5,77,40,450 నాబార్డు నిధులను మంజూరు చేశారు.

కమలాపురం నుంచి సుమారు 3 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం చేపట్టిన గుత్తేదారు మండల కేంద్రంలోని గౌరారంవాగు బ్రిడ్జి వద్ద నుంచి సుమారు 500 మీటర్ల మేర రిటైనింగ్‌వాల్‌ నిర్మాణం, పొదుమూరు వరకు కరకట్ట నిర్మించి, దొంగలఒర్రె నుంచి పుష్కరఘాట్‌ వరకు క రకట్ట నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ప్రతి ఏటా గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోత కు గురవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన 15 ఏళ్లకాలంలో గోదావరి ఒడ్డు వెంట విలువైన వందల ఎకరాల నల్లరేగడి భూములు ఇప్పటికే కోతకు గురై గోదావరిలో కలిసిపోయాయి. గోదావరి ఒడ్డు వెంట ఉన్న ఎకరం, రెండెకరాల సాగుభూమి మొత్తం గోదావరిలో కలిసిపోయిన పేదరైతులు నిరుపేదలుగా మారారు.

మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం
కరకట్ట నిర్మాణంలో గత 15 ఏళ్ల నుంచి జరుగుతున్న జాప్యం వల్ల మున్ముందు మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని పొదుమూరుకు కిలో మీటరుకు పైగా దూరంలో ఉండే గోదావరి గడిచిన 15 ఏళ్ల కాలంలో ఒడ్డు కోతకుగురి కావడంతో ప్రస్తుతం గ్రామానికి సుమారు 200 మీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతోపాటు ఊరచెరువుకు గోదావరి ఒడ్డుకు సుమారు 80 నుంచి 100 మీటర్ల దగ్గరకు చేరింది.

రాబోయే కాలంలో గోదావరి వరద కారణంగా చెరువుకు ప్రమాదం పొంచి ఉండటం, చెరువుకు అతి సమీపంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, లోతట్టు ప్రాంతం మీదుగా గోదావరి వరదనీరు మండల కేంద్రంలోకి వచ్చే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే మంగపేట మండల కేంద్రం సైతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.

పనులు చేపట్టకపోవడంలో అంతర్యం ఏమిటో..?
ఏటూరునాగారం మండలంలోని రాంనగర్‌ వద్ద 6 కిలోమీటర్లు, మంగపేట మండలంలోని దొంగలఒర్రె వద్ద నుంచి పుష్కరఘాట్‌ వరకు 2.5కిలో మీటర్ల వరకు గోదావరి తీరంవెంట కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.109.79 కోట్ల, భూసేకరణకు రూ.27 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఆయా పనులు చేపట్టేందుకు హర్ష కన్‌స్ట్రక్షన్‌తో 2022 ఏప్రిల్‌ 04న అగ్రిమెంట్‌ కూడా పూర్తయింది.

ఆయా పనులను ప్రారంభించే క్రమంలో అధిక వర్షాలు, గోదావరి వరదల కారణంగా పనులు నిలిచిపోయినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. 2022 జూలైలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు పడటంతో గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో జూలై 17న సీఎం కేసీఆర్‌ భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు ముంపు ప్రాంతాలను హెలీకాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఏటూరునాగారం ఐటీడీఏలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2008 సర్వే నివేదిక ఆధారంగా చేపట్టే కరకట్ట నిర్మాణం పనుల తాత్కాలికంగా నిలుపుదల చేసి ప్రస్తుత జూలైలో వచ్చిన గోదావరి వరద నీటి ప్రమాదాన్ని నివారించే విధంగా భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు అవసరమైన ప్రతి చోటా కరకట్ట నిర్మించేందుకు రీసర్వే చేసి నూతన ఎస్టిమేట్‌ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్స్‌ఫర్ట్‌ కమిటీని నియమించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

భూసేకరణకు సర్వే
మంగపేటలోని సండ్రోని ఒర్రె నుంచి పుష్కరఘాట్‌ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించేందుకు రూ.54.09 కోట్ల ఫ్లడ్‌ బ్యాంక్‌ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్‌ నిర్వహించగా హర్ష కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ టెండరు దక్కించుకుంది. పనులు ప్రారంభించేందుకు గోదావరి ఒడ్డు నుంచి సుమారు 30 మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు 50 నుంచి 60 ఎకరాల భూమి కోసం రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ, వర్షాకాలం వచ్చినా నేటి వరకు పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం
ప్రభుత్వం, ఎక్స్‌ఫర్ట్‌ కమిటీ ఆదేశాల మేరకు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన మేరకు భూసేకరణ కోసం సర్వే చేశాం. సర్వే నివేదికను ములుగు ఆర్డీఓకు సమర్పించాం. కరకట్ట నిర్మాణానికి డ్రాయింగ్‌ అప్రూవల్‌ కోసం పీఈసీడీఓ హైదరాబాద్‌ వారికి డ్రాయింగ్‌ సమర్పించాం. ఫ్లడ్‌ మోడల్‌ స్టడీస్‌ కోసం పీఎస్‌ ఈఆర్‌ఎల్‌ వారికి నివేదికలు అందచేశాం. ఆనుమతులు వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం.
– ఇరిగేషన్‌ ఏఈఈ వలీ మహ్మద్‌,మంగపేట సెక్షన్‌

నాలుగు ఎకరాలు గోదారిలో కలిసింది..
గోదావరి ఒడ్డు వెంట 11 ఎకరాల భూమి కోతకు గురై గోదారిలో కలిసి పోగా ఎకరం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఉన్న ఎకరం పొలంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నా. ఉన్న ఎకరంలో కరకట్ట నిర్మాణం కొరకు అర ఎకరం భూమి పోతోంది. అర ఎకరానికి మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తామంటున్నారు. గోదావరిలో కోల్పోయిన మొత్తం భూమికి పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– బొల్లె రాములు, పొదుమూరు, భూ యజమాని

సర్వే చేస్తున్న అధికారులు
1/3

సర్వే చేస్తున్న అధికారులు

2/3

3/3

Advertisement
Advertisement