breaking news
Godavari Shore
-
కరకట్ట కలేనా..? ముందుకు సాగని నిర్మాణ పనులు
మంగపేట: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణం కలగానే మిగులుతుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచగా ఉన్న కరకట్ట నిర్మాణంపై ఒక అడుగుముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. అధి కారులు, ప్రజాప్రతినిధులు. ప్రతి ఏటా వర్షాకాలంలో వరద కారణంగా గోదావరి ఒడ్డు వెంట గల వేలాది ఎకరాల సాగుభూములు గోదావరిలో కలిసిపోతోన్నాయి. దీంతో 30 ఏళ్ల క్రితం నుంచి గోదావరి ఒడ్డు వెంట రైతులుకు వరద కోత గుండెకోతగా మారింది. గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోతకు గురి కాకుండా ఉండేందుకు 2008లో అప్ప టి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్యాకేజీ వర్క్ కింద రూ.5,77,40,450 నాబార్డు నిధులను మంజూరు చేశారు. కమలాపురం నుంచి సుమారు 3 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం చేపట్టిన గుత్తేదారు మండల కేంద్రంలోని గౌరారంవాగు బ్రిడ్జి వద్ద నుంచి సుమారు 500 మీటర్ల మేర రిటైనింగ్‌వాల్ నిర్మాణం, పొదుమూరు వరకు కరకట్ట నిర్మించి, దొంగలఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు క రకట్ట నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ప్రతి ఏటా గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోత కు గురవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన 15 ఏళ్లకాలంలో గోదావరి ఒడ్డు వెంట విలువైన వందల ఎకరాల నల్లరేగడి భూములు ఇప్పటికే కోతకు గురై గోదావరిలో కలిసిపోయాయి. గోదావరి ఒడ్డు వెంట ఉన్న ఎకరం, రెండెకరాల సాగుభూమి మొత్తం గోదావరిలో కలిసిపోయిన పేదరైతులు నిరుపేదలుగా మారారు. మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం కరకట్ట నిర్మాణంలో గత 15 ఏళ్ల నుంచి జరుగుతున్న జాప్యం వల్ల మున్ముందు మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని పొదుమూరుకు కిలో మీటరుకు పైగా దూరంలో ఉండే గోదావరి గడిచిన 15 ఏళ్ల కాలంలో ఒడ్డు కోతకుగురి కావడంతో ప్రస్తుతం గ్రామానికి సుమారు 200 మీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతోపాటు ఊరచెరువుకు గోదావరి ఒడ్డుకు సుమారు 80 నుంచి 100 మీటర్ల దగ్గరకు చేరింది. రాబోయే కాలంలో గోదావరి వరద కారణంగా చెరువుకు ప్రమాదం పొంచి ఉండటం, చెరువుకు అతి సమీపంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, లోతట్టు ప్రాంతం మీదుగా గోదావరి వరదనీరు మండల కేంద్రంలోకి వచ్చే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే మంగపేట మండల కేంద్రం సైతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. పనులు చేపట్టకపోవడంలో అంతర్యం ఏమిటో..? ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ వద్ద 6 కిలోమీటర్లు, మంగపేట మండలంలోని దొంగలఒర్రె వద్ద నుంచి పుష్కరఘాట్ వరకు 2.5కిలో మీటర్ల వరకు గోదావరి తీరంవెంట కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.109.79 కోట్ల, భూసేకరణకు రూ.27 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఆయా పనులు చేపట్టేందుకు హర్ష కన్స్ట్రక్షన్తో 2022 ఏప్రిల్ 04న అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఆయా పనులను ప్రారంభించే క్రమంలో అధిక వర్షాలు, గోదావరి వరదల కారణంగా పనులు నిలిచిపోయినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. 2022 జూలైలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు పడటంతో గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో జూలై 17న సీఎం కేసీఆర్ భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు ముంపు ప్రాంతాలను హెలీకాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏటూరునాగారం ఐటీడీఏలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2008 సర్వే నివేదిక ఆధారంగా చేపట్టే కరకట్ట నిర్మాణం పనుల తాత్కాలికంగా నిలుపుదల చేసి ప్రస్తుత జూలైలో వచ్చిన గోదావరి వరద నీటి ప్రమాదాన్ని నివారించే విధంగా భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు అవసరమైన ప్రతి చోటా కరకట్ట నిర్మించేందుకు రీసర్వే చేసి నూతన ఎస్టిమేట్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్స్‌ఫర్ట్ కమిటీని నియమించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. భూసేకరణకు సర్వే మంగపేటలోని సండ్రోని ఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించేందుకు రూ.54.09 కోట్ల ఫ్లడ్ బ్యాంక్ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్ నిర్వహించగా హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ టెండరు దక్కించుకుంది. పనులు ప్రారంభించేందుకు గోదావరి ఒడ్డు నుంచి సుమారు 30 మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు 50 నుంచి 60 ఎకరాల భూమి కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ, వర్షాకాలం వచ్చినా నేటి వరకు పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం ప్రభుత్వం, ఎక్స్‌ఫర్ట్ కమిటీ ఆదేశాల మేరకు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన మేరకు భూసేకరణ కోసం సర్వే చేశాం. సర్వే నివేదికను ములుగు ఆర్డీఓకు సమర్పించాం. కరకట్ట నిర్మాణానికి డ్రాయింగ్ అప్రూవల్ కోసం పీఈసీడీఓ హైదరాబాద్ వారికి డ్రాయింగ్ సమర్పించాం. ఫ్లడ్ మోడల్ స్టడీస్ కోసం పీఎస్ ఈఆర్ఎల్ వారికి నివేదికలు అందచేశాం. ఆనుమతులు వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. – ఇరిగేషన్ ఏఈఈ వలీ మహ్మద్,మంగపేట సెక్షన్ నాలుగు ఎకరాలు గోదారిలో కలిసింది.. గోదావరి ఒడ్డు వెంట 11 ఎకరాల భూమి కోతకు గురై గోదారిలో కలిసి పోగా ఎకరం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఉన్న ఎకరం పొలంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నా. ఉన్న ఎకరంలో కరకట్ట నిర్మాణం కొరకు అర ఎకరం భూమి పోతోంది. అర ఎకరానికి మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తామంటున్నారు. గోదావరిలో కోల్పోయిన మొత్తం భూమికి పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – బొల్లె రాములు, పొదుమూరు, భూ యజమాని -
పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది!
-
పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది!
పులస పులుసు.. ఆ పేరు వింటే చాలు ఉభయ గోదావరి జిల్లావాసులకు నోరూరిపోవాల్సిందే. దాన్ని రుచిచూసిందాకా జిహ్వ మారాం మానదు. పిడకల పొయ్యిపై మట్టి మూకిడిలో సన్నకాకపై వండుతూ.. ఉప్పుకారం తగినంత దట్టించి.. కాసింత ఆవకాయ నూనె తగిలించి.. అరటి ఆకుపై వడ్డించుకుతింటుంటే ఉంటుంది నా సామిరంగా.. అబ్బ ఏం రుచిరాబాబు.. అంటూ లొట్టలేసుకు తినాల్సిందే. అంతటి అమోఘమైన రుచి పులస చేపది. అందుకే పుస్తెలమ్ముకోనైనా పులస తినాలంటారు గోదావరి జిల్లావాసులు. సాక్షి, అమరావతి : గోదావరి తీరానికి పులసల సీజన్ వచ్చేసింది. వరద (ఎర్ర నీరు) నీరు రావడంతో పులసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదుతూ వచ్చేస్తున్నాయి. దాదాపు అన్ని సముద్రాల్లోనూ ఉండే ఈ చేప రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో పులస చేపగా ప్రసిద్ధి. పుస్తెలమ్ముకునైనా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. ఏడాదిలో కేవలం జూలై నుంచి సెప్టెంబర్ వరకే పులస లభిస్తుంది. ఎర్రమట్టి తినడం కోసం, సంతానోత్పత్తి కోసం పులస ఈ మూడు నెలల కాలంలో ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రవహించే గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ తదితర నదుల్లోకి వస్తుంది. సముద్రంలో ఉన్నప్పుడు విలస! సముద్రంలో ఉన్నప్పుడు విలసగా పిలిచే ఈ చేపకు గోదావరిలోకి వచ్చాక స్థానికులు ముద్దుగా పులస అనే పేరు పెట్టుకున్నారు. గోదావరి నదీపాయల్లో ప్రవహించే మట్టితో కూడిన వరదనీటిని తాగడం వల్లే పులసకు అంత రుచి వచ్చిందని చెబుతున్నారు. సముద్రం నుంచి ఈదుకుంటూ రాజమహేంద్రవరం సమీపాన ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వచ్చేసరికి పులస ముదిరిపోతుంది. సముద్ర మొగ (ముఖద్వారం)లో లభించే చేప కంటే ధవళేశ్వరం, ఆత్రేయపురం, వద్దిపర్రు, బొబ్బర్లంక, సిద్దాంతం ప్రాంతాలకు వచ్చేసరికి దాని రుచి బాగుంటుంది. అలా వండితే నా సామిరంగా.. రంపపు పొట్టు లేదా, పిడకల పొయ్యిపై వెడల్పు కలిగిన మట్టి మూకిడిలో సన్నని కాకపై వండాలి. కొత్త ఆవకాయ నూనె, ఆముదం, బెండకాయలు, పెద్ద సైజు పచ్చిమిరపకాయలు వేసి వండితే ఎవరైనా పులస పులుసు లొట్టలేసుకుని తినాల్సిందే. వండిన రోజు కాకుండా తర్వాత రోజు తింటే ఆ టేస్టే వేరట. అరటి ఆకుపై పులస పులుసుతో భోజనం తింటుంటే ఆ రుచి రెట్టింపవుతుందని చెబుతున్నారు స్థానికులు. చుక్కల్లో ధరలు పులసకున్న డిమాండ్‌తో దాని ధర సామాన్యులనే కాదు ఒక మోస్తరు సంపన్నులకు కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుత సీజన్లో కేజీ పులస రూ.3000 నుంచి రూ.5000 పలుకుతోంది. పులస పులుసుకున్న డిమాండు నేపథ్యంలో యానాంకు చెందిన కొప్పిశెట్టి రమణ, రాజు ఆన్లైన్లో పులస పులుసు డోర్ డెలివరీ కోసం పులసఫిష్.కామ్ నడుపుతున్నారు. పొలుసుపై ఎర్రజార ఉంటేనే ఒరిజినల్ డూప్లికేట్ పులసలు మార్కెట్‌కు వస్తున్నాయి. గోదావరి పులస పోలికలతో ఉండే చేపలను ఒడిస్సా నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. గోదావరి పులసల పొలుసుపై ఎర్రజార ఉందో లేదో చూసుకుని కొనుక్కోవాలని మత్స్యకారులు సూచిస్తున్నారు.