
బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో గుర్తు తెలియని మహిళ ప్రవేశించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో ఇంటికి వచ్చిన ఆమె పనిమనిషితో ఆదిత్య రాయ్ కపూర్‌ను కలిసేందుకు వచ్చానని తెలిపింది. ఆయన కోసం బహుమతులు కూడా తీసుకొచ్చానని చెప్పింది. దీంతో ఆమెను ఇంట్లోకి అనుమతించారు. కానీ ఆ సమయంలో ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేరని సమాచారం.
ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంట్లోకి మహిళ వచ్చిన విషయాన్ని ఆ తర్వాత హీరోకు సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆదిత్య రాయ్ కపూర్ వెంటనే హౌసింగ్ సొసైటీ అధికారులను సంప్రదించగా.. వారు ఖర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 47 ఏళ్ల గజాలా సిద్ధిక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.
అయితే ఈ కేసు దర్యాప్తులో ఇది సిద్ధిక్‌కు ఇలా చేయడం మొదటి సారి కాదని తెలిసింది. గత వారంలో ఆమె సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దుబాయ్ నివాసిగా చెప్పుకునే గజాలా సిద్ధిక్.. ఆదిత్య రాయ్ కపూర్‌ను కలవడానికి ముంబైకి వచ్చానని పోలీసులతో చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన బాలీవుడ్ ప్రముఖులను సంప్రదించడానికి ఆమె పదే పదే ప్రయత్నించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.