మలయాళ నటీమణులు కోలీవుడ్‌లో మంచి అవకాశాలను తన్నుకు పోతున్నారు. అదేసమయంలో తమిళ చిత్రాల్లో తమిళ నటీమణులకు అవకాశాలు ఇవ్వడం లేదు వంటి ఆరోపణలు ఇటీవల ఎక్కవగా వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల కోలీవుడ్‌లో మంచి క్రేజీ అవకాశాలను అందుకుంటున్న మాలీవుడ్ నటి మమితా బైజు(Mamitha Baiju). ఈమె సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా కర చిత్రంలోనూ నటించారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ప్రస్తుతం మరిన్ని తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కర చిత్రంలో పరభాషా నటి మమితా బైజును నటింపజేయడం గురించి ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌రాజా ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ సినిమాల్లో నటీనటులను ఎంపిక చేయడం అనేది వారి భాష, ప్రాంతీయత ఆధారంగా ఎంపిక చేయడం ఉండదన్నారు. వారి నటనా ప్రతిభ, పాత్రలకు నప్పడం, ఉండే మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తామన్నారు. కర చిత్రం విషయంలో మమితా బైజును ఎంపిక చేయడానికి కారణం ఆమె పోషించిన పాత్రకు అంతకుముందు 20–25 మందిని ఆడిషన్ చేసినట్లు చెప్పారు.

వారెవరూ తగిన ప్రతిభను పదర్శించలేదన్నారు. అందరికంటే మమిత బైజు స్పష్టంగా బెటర్‌గా ఉండడంతో ఆమెను ఎంపిక చేసినట్లు విఘ్నేశ్‌రాజా వివరించారు. కాగా ధనుష్, మమితా బైజు జంటగా నటించిన కర చిత్రం 1990లో రామనాథపురంలో జరిగిన ఒక బ్యాంకు దోపిడీ ఇతివృత్తంతో రూపొందిందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఈనెల 30న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందన్నది గమనార్హం.


