
సాక్షి, చెన్నై: శ్రీ కాళికాంబాళ్ పిక్చర్స్ పతాకంపై కె.మాణిక్యం నిర్మించిన చిత్రం రెడ్ ఫ్లవర్. నటుడు విగ్నేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషా జాహ్నవి నాయకిగా నటించారు. వైజీ.మహేంద్రన్, జాన్‌విజయ్, తలైవాసల్ విజయ్, అజయ్‌రత్నం ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆండ్రూపాండియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కె.దేవసూర్య చాయాగ్రహణం, సంతోష్‌రామ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్టు 8న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం చైన్నె, వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు.
ఇందులో విశాల్, పి.వాసు, స్వరాజ్, ఫైవ్ స్టార్ కదిరేశన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నిర్మాత మాణిక్యం మాట్లాడుతూ ఇది ప్రేమ కథ చిత్రం మాత్రమే కాదని మన దేశ ఉన్నతిని చాటే చిత్రంగా ఉంటుందని చెప్పారు. విశాల్ మాట్లాడుతూ 2025లో జరిగే కథలను చిత్రాలుగా తీయడానికే పలువురు దర్శకులు తడబడుతున్నారని అలాంటిది ఈచిత్ర దర్శకుడు ఆండ్రు 2047లో ఏం జరగనుంది అనే విషయాన్ని తెరపై ఆవిష్కరించారని అన్నారు.
నేతాజీకి ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యానికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, థియేటర్లో చిత్రాలు విడుదలైన మూడు రోజుల వరకు పబ్లిక్ రివ్యూలను అనుమతించరాదని పేర్కొన్నారు. అదేవిధంగా నిర్మాతల సంఘం చిత్రాల రిలీజ్‌ను కట్టడి చేయాలని తెలిపారు.