
సినిమా రంగంలో నటీ నటుల మధ్య అనుబంధాలు ఎంత సహజమో...బ్రేకప్స్ కూడా అంతే సాధారణం. అలాగే అలాంటి అనుబంధాలను గురించిన పుకార్లు షికార్లు చేయడం అంతకు మించి సర్వసాధారణం. అందుకు తమిళ స్టార్ హీరో, యాక్షన్ సినిమాలకు పేరొందిన విశాల్ కూడా అతీతుడేమీ కాదు. అయితే చాలా సార్లు అలాంటి రూమర్లు నిజమవుతుంటాయి కూడా. తాజాగా సాయి ధన్షికను పెళ్లి చేసుకోనున్నట్టు విశాల్ ప్రకటించడం తెలిసిందే. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్న వార్తలు నిజమేనని వీరిద్దరూ తమ పెళ్లి ప్రకటనతో ధృవీకరించినట్టయింది.
(చదవండి: ఆ నటుడి వల్ల కన్నీటి పర్యంతం.. అండగా విశాల్, అదే సాయి ధన్సిక ప్రేమకు కారణం)
పెళ్లితో ఒక ఇంటి వాడు కాబోతున్న సందర్భంగా ఇక విశాల్ మీద ఇలాంటి అఫైర్ల వార్తలు పెద్దగా రాకపోవచ్చునని అనుకోవచ్చు. ఈ సందర్భంగా గతంలో హీరో విశాల్ కు మరికొందరు సహ నటీమణులతో అఫైర్స్ ఉన్నట్టు వచ్చిన వార్తలు ఒకసారి ప్రస్తావించుకుంటే.... అలాంటి వార్తల్లో తమిళ, తెలుగు అని లేకుండా దక్షిణాది సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ డేటింగ్ వార్త కూడా ఒకటి. వీరిద్దరి మధ్య సంబంధం గురించి కొంత కాలం పాటు పుకార్లు షికారు చేశాయి. అయితే వీటిని కొన్నాళ్లు కొనసాగనిచ్చాక... తాము ఇద్దరూ ప్రేమికులం కామని వీరిద్దరూ స్పష్టంగా ఖండించారు
తాము సన్నిహిత స్నేహితులమని స్పష్టం చేశారు. అప్పటికీ అవి ఆగకపోవడంతో... విశాల్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని అతను పెళ్లి చేసుకుంటానంటే.. తగిన వధువును తానే కనుగొని సూచిస్తానని అతనిపెళ్లి విషయంలో తాను సంతోషంగా సహకరిస్తానని అంటూ వరలక్ష్మి బహిరంగంగా పేర్కొంది. విశాల్ కూడా ఈ పుకార్లను ఖండించాడు. తాము చిన్ననాటి స్నేహితులమని తన పెళ్లి విషయంపై నిర్ణయం జరిగినప్పుడు తనే తన వివాహాన్ని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశాడు. ఆ తర్వాత వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాపారవేత్త నికోలాయ్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకుంది.
అదే విధంగా విశాల్ పేరుతో ముడిపడిన మరో నటి అభినయ.. అభినయ నటుడు విశాల్ మధ్య ప్రేమ సంబంధం గురించి పుకార్లు కొనసాగుతున్నంత కాలం అభినయ వాటిని నిరంతరం ఖండిస్తూ వచ్చింది, విశాల్ కేవలం తనకు ఒక నమ్మకమైన స్నేహితుడు మాత్రమే అని ఆమె పేర్కొంది. నటుడు విశాల్‌తో ప్రేమ సంబంధం గురించి పుకార్లను తోసిపుచ్చే క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఆమె వెల్లడించింది. చివరకు అభినయ గత ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో అందరి ఆశీస్సులతో అతన్ని వివాహం చేసుకుంది.
2018లో విడుదలైన తమిళ చిత్రం ఇరుంబు తిరల్ లో కలిసి నటించిన అభిరామి తో కూడా విశాల్‌కు సంబంధం ఉన్నట్టు కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ... అవి ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో ఖండించాల్సిన అవసరం కూడా వీరికి రాలేదు. హీరో విశాల్‌తో సంబంధాలు అంటకట్టబడిన వారందరూ ఇప్పటికే పెళ్లి చేసుకుని హాయిగా సంసారాలు చేసుకుంటూ ఉండగా, ఎట్టకేలకు తన చివరి అఫైర్..వార్తల్ని మాత్రం నిజం చేస్తూ విశాల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు.