
అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే విశాల్ (Vishal) పెళ్లిపీటలెక్కేవాడు, కానీ దానికి మరికొంత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. హీరో విశాల్.. హీరోయిన్ సాయి ధన్సిక (Sai Dhanshika)ను ఇదివరకే ప్రేయసిగా పరిచయం చేసిన విషయం తెలిసిందే! ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ ఓ ఈవెంట్‌లో బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది.
అదెప్పుడు పూర్తయితే అప్పుడే!
దీనిపై విశాల్ స్పందిస్తూ.. మా పెళ్లి నడిగరం సంఘం భవంతిలోనే జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాం. నడిగర్ సంఘం భవనం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూశాను. ఇంకో రెండు నెలలు ఆగలేనా? నడిగర్ సంఘంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.

ఆరోజు రెండు ప్రకటనలు
అయితే విశాల్ పుట్టినరోజయిన ఆగస్టు 29న రెండు గుడ్‌న్యూస్‌లు చెప్పనున్నాడట! ఒకటి నడిగర్ సంఘం భవంతి ప్రారంభోత్సవం గురించి, రెండోది తమ కొత్త పెళ్లి డేట్ గురించి! దీంతో ఆ రోజు కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం) భవన నిర్మాణం చాలామంది కల. ఈ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టారు. ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది.
సినిమా
దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు విశాల్. మొత్తానికి ఈ కల అతి త్వరలోనే పూర్తి కానుంది. సినిమాల విషయానికి వస్తే.. విశాల్ చివరగా మదగజరాజ మూవీతో అలరించాడు. ప్రస్తుతం తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కాగా విశాల్‌కు గతంలో నటి అనీషాతో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లిపీటలెక్కడానికి ముందే ఎవరి దారి వారు చూసుకున్నారు.
చదవండి: సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత