
చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్‌మెయిల్. తేజు అశ్విని, బిందు మాధవి కథానాయికలుగా నటించారు. మిస్సెస్ జేడీఎస్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై అమల్ రాజ్ నిర్మించిన మొదటి చిత్రం ఇది. ఎం.మారం కథా, దర్శకత్వం వహించగా శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
చివర్లో..
ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్‌లో నిర్వహించారు. దర్శక సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్ కుమార్, వసంత బాలన్, అధిక్ రవిచంద్రన్, నిర్మాత కదిరేసన్, ధనుంజయన్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అమల్ రాజ్.. జీవీ ప్రకాశ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చివర్లో 8 రోజుల షూటింగ్‌ను పూర్తి చేయలేని సమయంలో జీవీ ప్రకాష్ తనకు అండగా నిలబడ్డారన్నారు.
రుణపడి ఉంటా
ఏమీ ఆశించకుండా సగం పారితోషికం మాత్రమే తీసుకొన్నారని పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేయడంతో పాటు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసే వరకు హీరోనే కారకుడయ్యారన్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నటుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. మారం ప్రతిభావంతుడైన దర్శకుడని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్న అమల్ రాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నటి తేజుతో ఇంతకుముందు ఒక వీడియో సాంగ్ కోసం నటించానని అది బాగా వైరల్ అయిందని, ఆ విధంగా ఆమె ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక అయ్యారని జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొన్నారు.
చదవండి: పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే..