కష్టాలు దాటుకుని సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న తారలు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే ఒకరు. చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశానంటున్న ఈయన తాజాగా వాటిని ఓ సారి గుర్తు చేసుకున్నాడు. విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను. అప్పటివరకు కాఫీ షాప్‌లో పని చేశాను.
రోజులో 16 గంటలు పని
నా చదువు ముందుకు సాగాలంటే ఆ ఉద్యోగం చేయడం తప్పనిసరి. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో కూడా పని చేశాను. అదే సమయంలో ఓ డ్యాన్స్ గ్రూప్‌కు అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేశాను. ప్రతిరోజు నాలుగు లోకల్ ట్రైన్స్ మారేవాడిని. 16 గంటలు పనిచేసేవాడిని. పార్లీజీ బిస్కెట్, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకునేవాడిని. తర్వాత నేనొక షో చేశాను. దానికోసం దాదాపు 8 నెలలపాటు కష్టపడ్డాను.
డబ్బు కూడా సగమే..
తీరా ఆ షో ప్రసారమే కాలేదు. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సగమే ఇచ్చారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని చాలా బాధపడ్డాను. కొన్నేళ్ల తర్వాత ఆ షోను అర్ధరాత్రి టీవీలో ప్రసారం చేశారు. ఇలాంటి సమస్యలు యాక్టర్స్‌కు చివరి నిమిషం వరకు తెలియవు. అయితే ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన బ్యానర్‌లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెరకు.. అక్కడినుంచి వెండితెరకు పరిచయమయ్యాను అని గుర్తు చేసుకున్నాడు.
సీరియల్, సినిమా
విక్రాంత్ మాస్సే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), ఖుబూల్ హై వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు. సినిమాల్లో రాణించాలన్న ఆశతో బుల్లితెరకు గుడ్‌బై చెప్పాడు. లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రోమియో సినిమా చేస్తున్నాడు. షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
చదవండి: ఫ్లాప్ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే: చిరంజీవి కౌంటర్?


