భార్య–భర్త–మధ్యలో మాజీ ప్రేయసి | Venkatesh, Anil Ravipudi, Dil Raju Film Launched | Sakshi
Sakshi News home page

భార్య–భర్త–మధ్యలో మాజీ ప్రేయసి

Jul 4 2024 4:15 AM | Updated on Jul 4 2024 11:37 AM

Venkatesh, Anil Ravipudi, Dil Raju Film Launched

‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత హీరో వెంకటేశ్‌–దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా షురూ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందుతున్న 58వ చిత్రమిది. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. 

ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. వెంకటేశ్‌–మీనాక్షీ చౌదరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మరో నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. డైరెక్టర్‌ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. 

‘‘హీరో, అతని భార్య, మాజీ ప్రేయసి... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్‌ క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. హీరో– దర్శక–నిర్మాతల కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌లు రావడంతో మూడో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ కలగని అనుభూతిని అందించడానికి టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్‌. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, వీకే నరేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సమీర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement