
తమిళ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్ (68) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నటుడి మృతిపై పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వేలు ప్రభాకరన్.. 1980లో వచ్చిన `ఇవర్గళ్ విత్యసామానవర్గళ్` చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. `నాలయ మనిదన్` మూవీతో దర్శకుడిగా మారారు.
దర్శకుడిగా, నటుడిగా..
ఈ చిత్రం సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్‌గా `అతిశయ మనిదన్` మూవీ తెరకెక్కించారు. తన సినిమాల్లో సున్నితమైన విషయాలను నిస్సందేహంగా చర్చించేవారు. అలా అసురన్, రాజాలి, కడవుళ్, పురాచ్చిక్కారన్, కాదల్ కాదై, ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు. వేలు ప్రభాకరన్ (Velu Prabhakaran) దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మెప్పించారు.
పదినారు, గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్, కడవర్, పిజ్జా 3, రైడ్, వెపన్ చిత్రాల్లో నటించారు. చివరగా ఈ ఏడాది రిలీజైన గజన మూవీలో కనిపించారు. వేలు గతంలో దర్శకనటి పి.జయాదేవిని పెళ్లి చేసుకున్నారు. కాదల్ కాదై సినిమాలో తనతో కలిసి నటించిన షిర్లే దాస్‌ను 2017లో రెండో పెళ్లి చేసుకున్నారు.