‘వకీల్‌ సాబ్‌’ మూవీ రివ్యూ

Vakeel Saab Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : వకీల్‌ సాబ్‌
జానర్‌:  లీగల్‌ డ్రామా
నటీనటులు : పవన్‌ కల్యాణ్‌, శృతిహాసన్‌, ప్రకాశ్‌ రాజ్‌,  అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు : దిల్‌ రాజు, శిరీష్‌
సమర్పణ : బోనీ కపూర్‌
దర్శకత్వం : శ్రీరామ్ వేణు
సంగీతం : తమన్‌ 
సినిమాటోగ్రఫీ : పీఎస్‌ వినోద్‌
ఎడిటింగ్ : ప్రవీన్‌ పూడి
విడుదల తేది : ఏప్రిల్‌ 09, 2021

అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్‌ తీసుకొని ‘వకీల్‌ సాబ్‌’గా ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్‌. పవన్‌ రీఎంట్రీ మూవీ కావడం.. అందులోనూ అమితాబ్‌ నటించి బాలీవుడ్‌ బ్లాక్‌ బ్లస్టర్‌ పింక్‌ సినిమాకు రీమేక్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ‘వకీల్‌ సాబ్‌’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ వకీల్‌ సాబ్‌ ఏ మేరకు అందుకున్నాడు? పవన్‌ రీఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ
పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్‌(అనన్య నాగళ్ళ )వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. డ్యూటీకి వెళ్లడం, వచ్చిన డబ్బులు ఇంటికి పంపించడం వీరి కర్తవ్యం. ఇలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఈ ముగ్గురు ఒక రోజు పార్టీ కోసం బయటకు వెళ్లి రాత్రి క్యాబ్‌లో ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఎంపీ రాజేందర్‌(ముఖేష్‌ రిషి) కొడుకు వంశీ(వంశీకృష్ణ) గ్యాంగ్‌తో రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పల్లవిని అరెస్ట్‌ చేస్తారు.  మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని క్రమంలో సస్పెండ్‌కు గురైన లాయర్‌ సత్యదేవ్‌ అలియాస్‌ వకీల్‌ సాబ్‌( పవన్‌ కల్యాణ్‌) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్‌ ఎందుకు సస్పెండ్‌ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్‌ సాబ్‌ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న వంశీని, డబ్బులకు అమ్ముడుపోయే లాయర్‌ నందా(ప్రకాశ్‌ రాజ్‌)ని సత్యదేవ్‌ ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా కథ.

నటీనటులు
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ వెండితెరకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లి తెరపై కనిపించాడు. వకీల్‌ సాబ్‌ పాత్రలో పవన్‌ పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో పవన్‌ చెప్పే డైలాగ్స్‌  అబ్బురపరచడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇక శృతిహాసన్‌ చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్‌ సీన్‌లో పవన్‌ కల్యాణ్‌ జీవించేశాడు. అలాగే మధ్యతరగతి చెందిన యువతుల పాత్రల్లో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ అద్భుతంగా నటించారు. వకీల్‌ సాబ్‌ భార్య పాత్రలో శృతిహాసన్‌ పర్వాలేదనిపిస్తుంది. ఇక క్రిమినల్‌ లాయర్‌ నందా పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ ఎప్పటిమాదిరే జీవించేశాడు. వంశీకృష్ణతో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటిం‍చారు. 

విశ్లేషణ
బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘పింక్‌’కి రీమేకే ఈ వకీల్‌ సాబ్‌ సినిమా. సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్‌’. అక్కడ  అమితాబ్ బచ్చన్‌, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను అజిత్‌లో కోలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. అక్కడా సూపర్‌ హిట్‌ అయింది. రెండు చోట్ల సూపర్‌ హిట్‌ కావడంతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాడు నిర్మాత దిల్‌ రాజు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా, దానికి కొన్ని కమర్షియల్‌ హంగుల్ని  చేర్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్‌.

బాలీవుడ్‌, కోలీవుడ్‌లో చూపించని విధంగా ఇందులో పవన్‌ని యంగ్‌ లుక్‌లో చూపించారు. అలాగే హీరోకి ప్లాష్‌ బ్యాగ్‌ కూడా పెట్టాడు. అయితే అది మాత్రం వర్కౌట్‌ కాలేదు. సినిమా కథకు అది కాస్త అడ్డంకిగా అనిపిస్తుంది. అలాగే శ్రుతీహాసన్‌, పవన్‌ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్‌ సీన్స్‌కూడా అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ఉండటం కొంతమేర ప్రతికూల అంశమే. అలాగే ఇంటర్వెల్‌ వరకు అసలు కథ ముందుకు సాగదు.

ఇక సినిమాకు ప్రధాన బలం కోర్టు సీన్స్‌ . కోర్టు సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి.‘అడుక్కునోళ్లకి అన్నం దొరుకుంది. కష్టపడినోడికి నీడ దొరుకుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదు’, ‘ఆడది అంటే బాత్రుంలో ఉండే బొమ్మ కాదు నిన్ను కన్న అమ్మ’ లాంటి డైలాగ్స్‌ హృదయాలను హత్తుకుంటాయి. అయితే సెకండాఫ్‌ మొత్తం కోర్టు సన్నివేశాలే ఉండడం పవన్‌ ఫ్యాన్స్‌కు నచ్చినా.. సాధారణ ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది.

అలాగే కొన్ని డైలాగ్స్‌ పవన్‌ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టి రాసినట్లుగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్‌ అదరగొట్టాడు. పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సన్నివేశాలను కళ్లకుకట్టినట్లు చూపించాడు. పవీన్‌ పూడి ఎడిటింగ్‌ పర్వాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెరపడితే బాగుండనిపిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌ నటన
తమన్‌ సంగీతం
కోర్టు సీన్స్‌

మైనస్‌ పాయింట్స్
ఫస్టాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌ బ్యాక్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top