సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

Trivikram Emotional Speech About Sirivennela Seetharama Sastry Old Video Viral - Sakshi

Emotional Speech by Trivikram About Sirivennela Seetharama Sastry Old Video Viral: తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్తను సాహిత్య ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణం పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతారామశాస్త్రి పాటలను తలచుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా సీతారామశాస్త్రి గురించి గతంలో తివ్రిక్రమ్‌ చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ ప్రముఖ చానల్‌ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లో సిరివెన్నెలపై భావోద్వేగ ప్రసంగం ఇచ్చాడు త్రివిక్రమ్‌. 

‘సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే ‘సిరివెన్నెల’సినిమాలో రాసిన ‘ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి.

ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు.మన ఇంట్లోకి వచ్చి మనల్ని పశ్నిస్తాడు. ఓటమిని ఎప్పుకోవద్దు అంటాడు. సింధూరం సినిమాలో ‘అర్థ శతాబ్దం అజ్ఞానాన్నే స్వతంతం అందామా’ అనే ఒక‍్క మాటతో నేను లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా.. ఎక్కడి వెళ్తున్నానో తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది. సిరివెన్నెల తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం’అంటూ త్రివిక్రమ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top