మాటలతో నవ్వించడమే కాదు.. ఆలోచింపజేసే సంభాషణలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాల్లోని మాటలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో.. నిజ జీవితంలో ఆయన చెప్పే మాటలు కూడా అంతే విలువ ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. ఇలా ఎన్నో అంశాలపై గతంలో త్రివిక్రమ్ పంచుకున్న అభిప్రాయాలు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వైరల్ అవుతున్నాయి.
🔻చదువు మనిషికి ఎందుకు అవసరం అంటే.. ఒక మనిషి జీవినశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే.. ఒక పేదవాడి కొడుకుని డబ్బు ఉన్నవాడిని చేయగలిగేది చదువు.. ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ చేయగలిగేది చదువు. ఒక మాములు కొడుకుని సుందర్ పిచాయ్.. సత్యానాదేళ్ల అలాంటి వాళ్ల స్థాయికి తీసుకెళ్లి ప్రపంచం మొత్తం చూడగలిగేలా చేసేది చదువు. అందుకే మనిషికి చదువు అంత అవసరం.
మంచిదే చెబుదాం..
ఒక బూతు మాట్లాడి నవ్వించడం చాలా ఈజీ అందరి కంటే ముందు... ప్రతివాళ్లు నవ్వుతారు. కానీ నవ్విన వెంటనే మనల్ని చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే బహుశా అది వెంటనే అర్థం కాకపోవచ్చు.. కానీ వెళ్లిపోతున్న దారిలో అయినా సరే.. అది గుర్తుకువచ్చి.. అర్థం అయినప్పుడు అరే ఎంత గొప్ప మాట చెప్పాడు రా అనిపిస్తుంది. వెంటనే ఫొన్ చేసి మరి అభినందిస్తారు. అందుకే ఒక్కోసారి ఆలస్యం అయినా పర్లేదు కానీ మంచిదే చెబుదాం లే అనిపిస్తుంది.
🔻నేను ప్రయత్నం పూర్వకంగా జరిగేది ఏది నమ్మను. దానంతట అదే జరగనివ్వాలని కోరుకుంటాను. దేనిని పుష్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఏది జరిగినా సహజంగానే జరగాలి. అది మనల్ని ఎంతదూరం తీసుకెళ్తుందో అదే తీసుకెళ్లాలి. నదిలో ఏ క్షణం ఒకే నీటి బొట్టు ఒకే దగ్గర ప్రవహించదు. నేను కూడా అలాగే ఉండాలనుకుంటా. ఈ క్షణం ఉన్నట్లు తరువాత క్షణంలో ఉండకూదనే ప్రయత్నమే చేస్తాను.
ప్రపంచం బాగుండాలంటే..
ప్రపంచం బాగుండాలంటే ఏమీ చేయక్కర్లేదు. ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటే చాలు. సరిగ్గా ఊపిరి పీల్చితే.. మనిషికి 98శాతం జబ్బులు రావు. కానీ అది మనం చేయం. దాని బదులు సిగరెట్ కొనుక్కొని తాగి చనిపోడానికి వెనుకాడం. అలాగే కరెక్ట్ గా మంచి నీరు తాగితే చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ పని మనం చేయం. కానీ బీర్‌బాటిల్ కొనుక్కొని తాగి పాడైపోతాం. ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు, తల్లిదండ్రులు ఉచితంగా ఇచ్చేశారు. వాటికి ఖర్చేలేదసలు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే.. ఎక్కువ ఖర్చు పెట్టి దుబాయి.. అమెరికా వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
🔻మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చారిటి చేయడం లేదా ఇంకోరికి సాయం చేయడం లో మనకి ధైర్యం ఉంటుంది. రేపు మనకి ఏమీ కాదులే అనే నమ్మకం ఉంటుంది. కానీ.. మన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా సాయం చేసినవాళ్లు నిజంగానే గొప్పవాళ్లే అయింటారు. ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్లు దానం చేయడంలో సంతృప్తి లేదా మరొకటి ఉండచ్చు. కానీ డబ్బులేని వాడు దానం చేయడంలో మానవత్వం మాత్రమే ఉంటుంది. ఇలా వివిధ సందర్భాల్లో త్రివిక్రమ్ చెప్పిన మాటలను ఆయన పుట్టినరోజు సందర్భంగా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.


