Kamal Haasan: 72 ఏళ్ల సినీ ప్రయోగశాల | Kamal Haasan Turns 72: Interesting Facts About Kamal Haasan | Sakshi
Sakshi News home page

Kamal Haasan: 72 ఏళ్ల సినీ ప్రయోగశాల

Nov 7 2026 9:50 AM | Updated on Nov 7 2026 10:11 AM

Kamal Haasan Turns 72: Interesting Facts About Kamal Haasan

భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు కమల్‌ హాసన్‌. బాలనటుడిగా మొదలైన ఆయన ప్రయాణం.. దశాబ్దాలు గడిచినా ప్రయోగాలు, కొత్తదనం, సృజనాత్మకతతో కొనసాగుతూనే ఉంది. తెరపై కనిపించే నటుడిగా మాత్రమే కాకుండా.. సినిమా నిర్మాణంలోని దాదాపు ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసిన అరుదైన కళాకారుడిగా కమల్‌హాసన్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు(నవంబర్‌  7) ఆయన 72వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె అక్షరా హాసన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఎవరైనా తండ్రి కావచ్చు. కానీ ప్రతి ఒక్కరూ నాన్నగా, స్నేహితుడిగా, స్ఫూర్తిగా ఉండలేరు’ అంటూ తన ప్రేమను చాటుకున్నారు. అక్షరా చెప్పిన ఈ మాటలు కమల్‌ హాసన్‌ సినీ జీవితానికి కూడా సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ఆయనను చూసి నటన నేర్చుకున్నవారు, ఆయన ప్రయోగాల నుంచి స్ఫూర్తి పొందినవారు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు.

ఒకే సినిమాలో పది పాత్రలు..
కమల్‌ హాసన్‌ కెరీర్‌లో ప్రయోగాలకు కొదవలేదు. అందులో ‘దశావతారం’ ప్రత్యేకంగా నిలుస్తుంది. 2008లో వచ్చిన ఈ సినిమాలో ఆయన ఏకంగా పది విభిన్న పాత్రల్లో కనిపించారు. ఒక్కో పాత్రకు భిన్నమైన రూపం, శరీరాకృతి, హావభావాలు తీసుకొచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇలాంటి ప్రయోగాలు చేయడానికి నటుడిగా ఎంతటి అంకితభావం అవసరమో ఈ సినిమా నిరూపించింది. పాత్ర కోసం తనను తాను మార్చుకోవడంలో కమల్‌హాసన్‌కు ఉన్న ఆసక్తికి ఇది ఓ ఉదాహరణగా నిలిచింది.

(చదవండి: ‘శూర్పణఖ’ పాత్ర నా జీవితంలో చాలా ప్రత్యేకం.. రకుల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!)

నటనకే కాదు.. టెక్నాలజీకి కూడా పెద్దపీట
కమల్‌హాసన్‌ ప్రత్యేకత కేవలం నటనలోనే లేదు. సినిమా సాంకేతికతలోనూ కొత్తదనాన్ని ప్రయత్నించడంలో ఆయన ముందుండేవారు. ‘విక్రమ్‌’ (1986)లో కంప్యూటర్‌ ఆధారిత పాటల రికార్డింగ్‌ వంటి ప్రయోగాలు చేయగా.. ‘ఇండియన్‌’ సినిమాలో ప్రోస్థెటిక్‌ మేకప్‌ను విస్తృతంగా ఉపయోగించారు. సినిమా అంటే కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాదని.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్‌, మేకప్‌, సంగీతం వంటి అనేక విభాగాల సమ్మేళనమని తన కెరీర్‌తోనే చూపించారు.

230కిపైగా చిత్రాలు.. ఎన్నో భాషల్లో ప్రయాణం
కమల్‌ హాసన్‌ ఇప్పటివరకు 230కిపైగా చిత్రాల్లో నటించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, గేయ రచయిత, ఎడిటర్‌, కొరియోగ్రాఫర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌గానూ పనిచేశారు. అందుకే ఆయనను ‘వన్‌ మ్యాన్‌ ఇండస్ట్రీ’ అని పిలవడం మొదలైంది.

అవార్డులు.. అంతర్జాతీయ గౌరవాలు
కమల్‌ హాసన్‌ ప్రతిభకు దేశ, విదేశాల్లో ఎన్నో గౌరవాలు దక్కాయి. 1978లో కళైమామణి, 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు. 2016లో ఫ్రాన్స్‌ ప్రభుత్వం ‘చెవాలియర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌’తో సత్కరించింది. 2025లో అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ఆయనను నటుల విభాగంలో సభ్యుడిగా ఆహ్వానించింది.

(చదవండి: చిరంజీవి కాకా వాయిదా.. నిర్మాత ఫుల్ క్లారిటీ..!)

ఆస్కార్‌ బాట పట్టిన ఏడు సినిమాలు
కమల్‌ హాసన్‌ నటించిన లేదా ఆయనతో అనుబంధం ఉన్న ఏడు సినిమాలు భారతదేశం తరఫున ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగానికి ఆస్కార్‌ ఎంట్రీలుగా ఎంపికయ్యాయి. భారతీయ నటుల్లో ఈ స్థాయిలో ఎక్కువ సినిమాలతో ఆస్కార్‌ ఎంపికలతో అనుబంధం ఉన్న అరుదైన ఘనత ఆయన సొంతమని నివేదికలు చెబుతున్నాయి.

రూ.కోటి తీసుకున్న తొలి నటుడు
కమల్ హాసన్ అత్యధిక పారితోషికం తీసుకునే యాక్టర్స్ లో ఒకరు. 1994లో ఓ చిత్రానికి కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి కోలీవుడ్‌ నటుడిగా కూడా ఆయన పేరు నిలిచింది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. 2022లో విడుదలైన 'విక్రమ్' సినిమా కమల్ హాసన్ కెరీర్‌లో మరో మైల్ స్టోన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ మార్కెట్ మరింత పెరిగింది.

రజనీకాంత్‌తో మరోసారి తెరపై..
ప్రస్తుతం కమల్‌ హాసన్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ఆయన ఓ సినిమాలో నటించనున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 

నటుడిగా మొదలైన ప్రయాణం.. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, సాంకేతిక నిపుణుడిగా ఎన్నో మలుపులు తిరిగింది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రయోగాల పట్ల ఆసక్తి మాత్రం తగ్గలేదు. అందుకే కమల్‌ హాసన్‌ ఒక నటుడు మాత్రమే కాదు.. భారతీయ సినిమా ప్రయోగాల చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement