టాలీవుడ్‌లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ(LLP) ప్రపంచవ్యాప్తంగా మే 28న విడుదల చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…‘ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది’ అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ…‘మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది.


