ది ట్రైటర్స్ తెలుగు: మైండ్ గేమ్‌తో ఆకట్టుకుంటున్న డైరెక్టర్‌ | The Traitors Telugu: JSS Vardhan Impressing With His Style Of Game | Sakshi
Sakshi News home page

ది ట్రైటర్స్ తెలుగు: మైండ్ గేమ్‌తో ఆకట్టుకుంటున్న వర్ధన్

Oct 24 2026 6:31 PM | Updated on Oct 24 2026 6:40 PM

The Traitors Telugu: JSS Vardhan Impressing With His Style Of Game

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న తెలుగు రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు పూర్తికాగా.. ఎవరిని నమ్మాలి? ఎవరు మోసం చేస్తున్నారు? అనే ప్రశ్నలతో గేమ్‌ మరింత ఉత్కంఠగా సాగుతోంది. వ్యూహాలు, అనుమానాలు, మైండ్‌ గేమ్స్‌తో సాగుతున్న ఈ షోలో కంటెస్టెంట్స్‌ ఎవరికి వారు పోటీగా ఆడుతున్నారు. ప్రతి కంటెస్టెంట్ ఒక్కో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక దర్శకుడు, రచయిత జె.ఎస్.ఎస్. వర్ధన్  బుద్ధిబలంతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ తనదైన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

‘గీతా సుబ్రహ్మణ్యం’, ‘హలో వరల్డ్’ వంటి వెబ్ సిరీస్‌లతో పాటు ‘భలే ఉన్నాడే’, ‘బ్యూటీ’ వంటి చిత్రాలకు రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ‘ది ట్రైటర్స్’లో తన పరిశీలనా శక్తి, వ్యూహరచనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకముందే చిన్మయిని ఎంపిక చేసుకోవడం నుంచి.. గేమ్‌లో ఎవరు ట్రేటర్‌ అనే విషయాన్ని విశ్లేషించడం వరకు తనదైన శైలిలో ఆడుతున్నారు.

గేమ్‌లో వర్ధన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన ఆటతీరుకు అద్దం పడుతున్నాయి. గౌరవ్ ట్రేటర్ కాదని నమ్మి అతనికి మద్దతుగా నిలిచిన కొద్దిమంది కంటెస్టెంట్లలో వర్ధన్ కూడా ఒకరు. మరోవైపు తనకు సన్నిహితంగా ఉన్న చిన్మయి, నిఖిల్, గౌరవ్‌లను ట్రేటర్స్ లక్ష్యంగా చేసుకోవడంతో.. గేమ్‌లోని పరిణామాలను మరింత నిశితంగా పరిశీలించారు.

ఈ క్రమంలో విద్యులేఖను ట్రేటర్‌గా గుర్తించడంలో వర్ధన్ కీలక పాత్ర పోషించారు. తన అనుమానాలను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లి, ‘రింగ్ ఆఫ్ డౌట్’లో విద్యులేఖ ఎలిమినేషన్‌కు దోహదపడ్డారు. దీంతో కేవలం ఆటల్లోనే కాకుండా.. ఇతర కంటెస్టెంట్ల ప్రవర్తనను గమనించి నిర్ణయాలు తీసుకోవడంలోనూ వర్ధన్ చురుకుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల ప్రసారమైన నాలుగు, ఐదు, ఆరు ఎపిసోడ్‌లలో వర్ధన్ పేరు పలువురు కంటెస్టెంట్ల చర్చల్లో వినిపించింది. ఒకవైపు ఆయనను బలమైన ప్లేయర్‌గా భావిస్తుండగా.. మరోవైపు హిట్ లిస్ట్‌లో ఆయన పేరు ఉండటం గేమ్‌లో ఉత్కంఠను పెంచుతోంది.

అసలైన ట్రేటర్‌గా రాహత్‌ను గుర్తించి, అతడి వ్యూహాలను ఇతర కంటెస్టెంట్లకు వివరించడంలో వర్ధన్ ప్రత్యేకంగా నిలిచారు. ఓట్ల లెక్కింపులో మోనిషా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. ఆమెను తనవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో రాహత్ ఆమెకు మద్దతు ఇచ్చాడని వర్ధన్ విశ్లేషించారు. మోనిషాను ఎందుకు ఎంచుకున్నాడు? దాని వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అనే అంశాలను ఇతరులకు అర్థమయ్యేలా వివరించారు. రాహత్ అసలు గేమ్ ప్లాన్‌ను బయటపెట్టడంలో వర్ధన్ విశ్లేషణ కీలకంగా మారింది.

ఇప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్‌లలో చివరిది మరింత ఉత్కంఠను పెంచింది. వర్ధన్ షో నుంచి బయటకు వెళ్లిపోతారని కొందరు భావించినప్పటికీ.. రాహత్ ఎలిమినేట్ కావడం కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఉదయం లేచి అల్పాహారం తీసుకోవడం కూడా గేమ్‌లో భయాందోళనలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది.

మరోవైపు ట్రేటర్స్ బలమైన ప్లేయర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. వర్ధన్ బలంగా ఆడుతున్నప్పటికీ.. హర్ష వర్ధన్ అతడే ట్రేటర్ అని చెప్పడం గేమ్‌ను మరో మలుపు తిప్పింది. అయితే ఆ అనుమానానికి అనుగుణంగా పరిణామాలు చోటుచేసుకోకపోవడంతో.. తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement