‘బాహుబలి,’ ‘ఆర్‌ఆర్ఆర్’ లాంటి సినిమాలతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. అయితే ఆయన హాలీవుడ్‌లో సినిమా చేస్తారా అనే చర్చ చానాళ్ల నుంచే ఉంది. ఈ క్రమంలో తాజాగా బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జక్కన్న తన మనసులోని మాటను బయటపెట్టారు. హాలీవుడ్ ఎంట్రీపై మాట్లాడారు.
హాలీవుడ్‌లో చాలా అవకాశాలు
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తర్వాత నాకు హాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే వారణాసి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టలను ముందుకు తీసుకెళ్లలేను. ఒకటి పూర్తయిన తర్వాత వేరే దానిపై దృష్టిపెడతాను. ఇప్పటికీ కొన్ని ఆఫర్లు లైన్‌లో ఉన్నాయి. నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. వారణాసి పూర్తయ్యాక కచ్చితంగా వాటి గురించి ఆలోచిస్తా. హాలివుడ్‌లో పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అక్క పనితీరు.. నిర్మాణాత్మక శైలి ఎంతో అద్భుతంగా ఉంటాయి’ అని తెలిపారు.
వారణాసి విషయానికొస్తే..
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్‌బాబు రుద్రగా.. శ్రీరాముడి పాత్రలోనూ మెప్పించనున్నాడు. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. కార్తికేయ, కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దాదాపు 120 దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణపై రాజమౌళి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ మరో 10 రోజులు మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఇల్లు కట్టిన కమెడియన్.. వీడియో వైరల్)


