ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’పై మొదటి నుంచీ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ సినిమాలో డార్లింగ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? అసలు ఫౌజీ అంటే ఏమిటి? కథ ఎక్కడ, ఏ కాలంలో సాగుతుంది? బ్రిటిష్ రికార్డుల్లో అతడి పేరు ఎందుకు మోస్ట్ వాంటెడ్‌గా నమోదైంది? తాజాగా విడుదలైన ‘ఫైల్ నంబర్ 25’ గ్లింప్స్ ఈ ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ప్రేక్షకులు అంతగా గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది.
ఫౌజీ అంటే ఆయుధం కాదు.. అతడో వ్యక్తి
‘ఫౌజీ’ అనే టైటిల్ వినగానే చాలామందికి సైనికుడనే అర్థం గుర్తుకొస్తుంది. అయితే ఈ సినిమాలో ఫౌజీ అనేది కేవలం సైనికుడిని సూచించే పదం మాత్రమే కాదు.. హీరో పాత్ర పేరు కూడా! అతడి అసలు పేరు ఎవరికీ తెలియదనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. అంటే, అసలు పేరు తెలియని ఓ వ్యక్తి.. బ్రిటిష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేసే స్థాయికి ఎలా ఎదిగాడన్నదే కథలో కీలకమైన అంశంగా కనిపిస్తోంది. హీరో పాత్ర చుట్టూ ఉన్న ఈ మిస్టరీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
భగవద్గీతతో రహస్య కోడ్
ఈ గ్లింప్స్‌లో మరో ఆసక్తికరమైన అంశం భగవద్గీత ఆధారంగా రూపొందించిన రహస్య కోడ్. తన వ్యూహాల్లో భాగంగా ఫౌజీ ఈ కోడ్‌ను ఉపయోగిస్తాడని తెలుస్తోంది. దాన్ని ఛేదించడానికి బ్రిటిషర్లు ప్రయత్నించినా.. వారి వల్ల కావడం లేదనే అంశం అతడి తెలివితేటలను తెలియజేస్తోంది. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ఓ యోధుడు తన మేధస్సును, వ్యూహాలను ఉపయోగించి శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడనే కోణాన్ని ఈ అంశం సూచిస్తోంది. కేవలం ఆయుధాలతోనే కాకుండా.. ఆలోచనలతోనూ శత్రువులను ముప్పుతిప్పలు పెట్టే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు అర్థమవుతోంది.
బెంగాల్ నేపథ్యంలో కథ
‘ఫైల్ నంబర్ 25’ గ్లింప్స్ రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించిన సన్నివేశాలతో మొదలవుతుంది. 1942లో బెర్లిన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణను ఇందులో చూపించారు. మరోవైపు, సినిమా కథ పశ్చిమ బెంగాల్ నేపథ్యంతో సాగనున్నట్లు సమాచారం. ఈ చారిత్రక నేపథ్యం, గూఢచర్యం, యుద్ధ వ్యూహాలు కథలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.
1932 నుంచే బ్రిటిష్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఫౌజీ.. తన తెలివితేటలతో శత్రువులకు సవాల్ విసురుతుంటాడు. అయితే అతడెవరు? అతడి గతం ఏమిటి? బ్రిటిష్ పాలకులకు ఎందుకంత ప్రమాదకరంగా మారాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలోనే తెలియనున్నాయి.
ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో ప్రభాస్
ఈ గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణ ప్రభాస్ లుక్కే. రెబల్ సైనికుడిగా ఆయన కనిపించిన తీరు కొత్తగా ఉంది. పాత్రకు తగ్గట్టుగా ప్రభాస్‌ను భిన్నమైన అవతారంలో చూపించడంలో దర్శకుడు హను రాఘవపూడి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యానికి అనుగుణంగా హీరో పాత్రను పరిచయం చేసిన తీరు అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.
మొత్తానికి ‘ఫైల్ నంబర్ 25’ గ్లింప్స్ కేవలం ప్రభాస్ లుక్‌ను పరిచయం చేయడంతో ఆగిపోలేదు. ఫౌజీ అనే వ్యక్తి చుట్టూ ఉన్న రహస్యాన్ని, భగవద్గీత ఆధారంగా రూపొందించిన కోడ్‌ను, రెండో ప్రపంచ యుద్ధ కాలపు నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథపై ఆసక్తిని పెంచింది. అసలు పేరు తెలియని ఓ వ్యక్తి బ్రిటిషర్లకు సింహస్వప్నంగా ఎలా మారాడు? అతడి వ్యూహాల వెనుక ఉన్న రహస్యమేంటి? అన్నది తెరపై చూడాల్సిందే.


