‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి కియరా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి పాత్రలకు సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి యశ్ లుక్‌తో పాటు టీజర్‌ని రిలీజ్ చేశారు. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా గురువారం (జనవరి 8)ఈ టీజర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ టీజర్‌లో యశ్‌ను రాయా పాత్రలో పరిచయం చేశారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ కొడుక్కి దహన సంస్కారాలు జరుగుతుండగా రాయా (యశ్) అక్కడికి కారులో వస్తాడు. దాని నుంచి వైర్ల ద్వారా స్మశానం లోపల డైనమేట్లు పెట్టించి కారు నుంచి బయటికి రాకుండా బాంబులు పేల్చేస్తాడు. అది ఎలా చేశాడనేది బోల్డ్‌గా చూపించారు. రూథ్‌లెస్ మాఫియా బాస్‌గా యశ్ కనిపిస్తున్నాడు. హాలీవుడ్ వైబ్స్‌తో కూడిన ఈ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


