
కోలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ. 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ జంటగా నటించారు. అయితే, ఈ చిత్రంలో నటించిన బాలనటుడు కమలేష్ జగన్‌ను తమిళ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. సినిమాలో ఈ బాలుడే ప్రధాన ఆకర్షణగా ఉన్నాడంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరీ కమలేష్ అంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని చూసిన హీరో శివకార్తికేయన్ చిత్రబృందాన్ని నేరుగా పిలిపించి అభినందించారు. ప్రత్యేకంగా కమలేష్‌ను మెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కూడా ఈ చిత్రం సూపర్ అంటూ తెలిపారు.

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో శశికుమార్, సిమ్రన్‌ల కుమారుడి పాత్రలో కమలేష్ నటించాడు. ఇందులో విజయ్ దళపతి అభిమానిగా కనిపించి తన నటనతో కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. వాస్తవంగా కమలేష్ నటుడు కాదు.. ఒక సింగర్. 'స రే గ మ ప లిల్ చాంప్స్ సీజన్ 2'లో మొదటిసారి తెరపై మెరిశాడు. ఆ రియాలిటీ షోకు అతిథిలుగా త్రిష కృష్ణన్, నయనతార, అమలా పాల్ హాజరయ్యారు. ఆ సమయంలోనే తన టాలెంట్‌ను చూసి వారు ఫిదా అయ్యారు. అలా వారి నుంచి ప్రశంసలు అందుకున్న తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది. అలా కమలేష్‌కు జ్యోతిక సినిమాలో మొదటిసారి ఛాన్స్ దక్కింది.
జ్యోతిక నటించిన తమిళ చిత్రం ‘రాచ్చసి’లో కమలేష్ నటించాడు. ఇందులో ఒక స్కూల్ టీచర్ పాత్రలో ఆమె నటించగా.. కమలేష్ స్టూడెంట్‌గా కనిపించాడు. ఈ మూవీ తర్వాత నయనతార, సమంత, విజయ్ సేతుపతి నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కూడా కమలేష్ నటిస్తున్నాడు. ఆపై కాంచన 4లో కూడా ఛాన్స్ కొట్టేశాడు.
'జ్యోతిక మేడం బిర్యానీ పెట్టారు'
రాచ్చసి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి కమలేష్ ఇలా చెప్పాడు. ' నా పుట్టినరోజు నాడు జ్యోతిక మేడమ్ సెట్స్‌లోని అందరికీ బిర్యానీ తెప్పించారు. తన సొంత కొడుకు మాదిరి ఆమె నాపై చూపిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఈ క్రమంలోనే ఒకరోజు సూర్య సార్ కూడా సెట్స్‌కి వచ్చారు. అప్పుడు ప్రత్యేకించి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. జ్యోతిక మేడమ్ ప్రతిరోజు ఇంట్లో నా గురించి చెబుతుందని అన్నారు. ఇంతకీ నువ్వు ఏం చేశావ్ అంటూ సరదా పట్టించారు.' అని గుర్తుచేసుకున్నాడు.