తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తుంటారు. కుదిరితే ఏడాది రెండు లేదంటే కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలుగులో చాలామంది ఒక్కో సినిమా కోసం ఏడాది, రెండేళ్లు కూడా పని చేస్తున్నారు. భారీ బడ్జెట్, విదేశాల్లో షూటింగ్స్, నటీనటుల డేట్స్ క్లాష్,పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్, రిలీజ్ డేట్స్ క్లాష్... ఇలా కారణాలు ఏవైనా కొందరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ప్రతి ఏడాది ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లు తక్కువగానే ఉంటున్నారు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కి వెళ్లింది. దీంతో నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, అనుకున్న ఔట్‌పుట్ వచ్చేవరకు రాజీ పడటం లేదు. లేట్ అయినా పర్లేదు కానీ ఫైనల్‌గా ఆడియన్స్‌కి బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చి, వారిని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ కారణంగా షూటింగ్,పోస్ట్ ప్రోడక్షన్‌కే చాలా సమయం తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పలువురు హీరోలు ప్రతి ఏడాది తమ సినిమాలను విడుదల చేయలేక΄ోతున్నారు. ఇందులో భాగంగా హీరోలు నాగార్జున, బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... ఇలా పలువురు హీరోలు 2026ని మిస్ అవుతున్నారు. వారి సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.
రెండోసారి...
తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. గతంలో వరుస సినిమాలతో అటు అక్కినేని అభిమానులను ఇటు ప్రేక్షకులను అలరించిన ఆయన సోలో హీరోగా వరుసగా రెండేళ్లు మిస్ అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘నా సామిరంగ’ 2024లో విడుదలైంది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. ఆ తర్వాత నాగార్జున సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే ‘కుబేర, కూలీ’ వంటి తమిళ సినిమాల ద్వారా తెలుగు–తమిళ ప్రేక్షకులను పలకరించారాయన. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో తనదైన నటనతో మెప్పించారు నాగార్జున. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలోనూ ధనుష్‌తో కలిసి నటించారు. ఈ సినిమా 2025 జూన్ 20న విడుదలైంది. ఇదిలా ఉంటే... తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా కోసం కాస్త సమయం తీసుకుని కథని ఓకే చేశారు నాగార్జున. ఆయన నటిస్తున్న 100వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ అందుకున్న విషయం తెలిసిందే. తన కెరీర్‌లో 100వ సినిమా అనేది కీలకమైనది కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నాగార్జున.
ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులు మనాలీలో శరవేగంగా జరుగుతోంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ కార్తీక్. ఈ మూవీలో మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు నాగార్జున. ఈ చిత్రంలో ఆయన 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వివిధ దశల్లో, విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆధునిక హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికత సాయంతో నాగార్జునను 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు.
సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రకథ తండ్రీ–కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందట. ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ వంటి టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయాలని తొలుత యూనిట్ అనుకుందట. అయితే నాగార్జునకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సందర్భంగా 2027లో విడుదల చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ రకంగా చూస్తే సోలో హీరోగా నాగార్జున వరుసగా 2025, 2026... రెండేళ్లను మిస్ అవుతున్నట్లే లెక్క.
ఏడాది గ్యాప్
బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2: తాండవం’ గత ఏడాది విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ మూవీస్ తర్వాత బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా 2025 డిసెంబరు 12న విడుదలైంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ నటించనున్న చిత్రం ‘ఎన్‌బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
‘వీర సింహారెడ్డి’ (2023) తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘ఎన్‌బీకే 111’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా నయనతార నటిస్తున్నారు. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా’ వంటి సినిమాల తర్వాత బాలకృష్ణ– నయనతార జోడీగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. పవర్‌ఫుల్ ఎమోషన్ ్స, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ముంబై నేపథ్యంలో ఉంటుందట. ఈ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కనిపిస్తారని టాక్.
దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయాలని చిత్రయూనిట్ తొలుత భావించింది. అయితే రెగ్యులర్ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో షూటింగ్ ఆలస్యమైనా సరే ఔట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదన్నది మేకర్స్ ఆలోచన అట. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణ, పోస్ట్ ప్రోడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావనే ఆలోచనతో డిసెంబరులో విడుదల చేద్దామన్నది మరో ఆలోచన అట. అయితే బాలకృష్ణకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ 2027 సంక్రాంతికి ‘ఎన్‌బీకే 111’ని విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఈ లెక్కన చూస్తే 2026ని బాలకృష్ణ మిస్ అయినట్లే అని భావించవచ్చు.
రెండున్నరేళ్లకు పైగా గ్యాప్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’ 2024 లో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెం బరు 27న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘వార్ 2’. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. ఈ మూవీలో ప్రతి నాయకుడిగా నటించారు ఎన్టీఆర్. అంతేకాదు... ఈ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
‘దేవర: పార్ట్ 1’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రపోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు.
ఈ రెండు పాత్రల కోసం ఆయన మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ రిలీజ్ డేట్‌లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తేదీకి ‘డ్రాగన్’ తప్పకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ అనుకున్నారు.
మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూశారు. అనుకున్నట్లే అప్‌డేట్ వచ్చింది.. అయితే సినిమాని 2026 జూన్ 25 నుంచి 2027 జూన్ 11కి విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో తమ అభిమాన హీరో సినిమా కోసం మరో ఏడాది పాటు ఫ్యాన్స్ నిరీక్షించక తప్పదు. ఈ విధంగా చూస్తే ‘దేవర: పార్ట్ 1’ విడుదలైన 2024 సెప్టెంబరు 27 నుంచి 2027 జూన్ 11 మధ్య గ్యాప్ రెండున్నరేళ్లకు పైగానే ఉంది.
సెకండ్ టైమ్
‘ఏంట్రోయ్... గ్యాప్ ఇచ్చావ్’ అంటూ నటుడు మురళీ శర్మ అనగానే... ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో చూశాం. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూస్తే ఆయన కావాలని గ్యాప్ ఇవ్వకున్నా వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించనున్న 22వ సినిమా విషయంలో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
‘పుష్ప: ది రూల్’ మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తమిళ డైరెక్టర్ అట్లీతో నటించేందుకు అల్లు అర్జున్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ 22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాకి ‘రాకా’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ సాంకేతికతతో హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా ‘రాకా’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌తో అల్లు అర్జున్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. ఈపోస్టర్ చూస్తే.. అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ సరికొత్త అవతారంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండు, వింత శరీరాకృతి, చూపుల్లో వాడీ వేడి... ఇలా సరికొత్త లుక్‌లో ఉండటంతో ‘రాకా’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రాకా’ ఒకటి. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు అట్లీ.
హాలీవుడ్ సినిమాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఇచ్చారాయన. ‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రకంగా చూస్తే వరుసగా 2025, 2026 ఏడాదిలను అల్లు అర్జున్ మిస్ అయ్యారు.
సంవత్సరం గ్యాప్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాల నటుడిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో సోలో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఆ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. ‘జాంబి రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా–ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘హనుమాన్’. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది.
ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు తేజ సజ్జా. ‘హనుమాన్’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్ ప్రధాన పాత్రపోషించారు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2025 సెప్టెంబరు 12న విడుదలై, హిట్‌గా నిలిచింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత తేజ సజ్జా నటించనున్న చిత్రాలపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
అయితే తన హిట్ సినిమాలైన ‘జాంబి రెడ్డి’కి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి 2’, ‘హనుమాన్’ మూవీకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రం సీక్వెల్ ‘మిరాయ్: జైత్ర’ లో నటించనున్నట్లు తేజా సజ్జా పేర్కొన్న సంగతి తెలిసిందే. వీటిల్లో ముందుగా ‘జై హనుమాన్ ’ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషబ్ శెటì ్ట హనుమంతుడి పాత్ర చేయనున్నారు. ఈ మూవీలో తేజ సజ్జా తన పాత్రని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లి, 2027లో విడుదల కానుంది. ఈ లెక్కన చూస్తే తేజ సజ్జా 2026ని మిస్ అవుతున్నారు.
మూడేళ్లు గ్యాప్...
హీరో మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చో ప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత ‘వారణాసి’ కోసం మేకోవర్ అయ్యేందుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు మహేశ్‌బాబు. ఈ మూవీ కోసం ΄÷డవాటి హెయిర్ స్టైల్‌తో పాటు లైట్‌గా గెడ్డం కూడా పెంచారాయన. ఫిజికల్ మేకోవర్ కోసం బాగా కృషి చేశారు.
ఇందుకోసం దాదాపు ఆరు నెలల పాటు ట్రైన్ అయ్యారట. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకుపైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాతపోస్ట్ ప్రోడక్షన్‌కి కూడా దాదాపు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు సమయం పడుతుంది. ఈ సినిమాలో మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. రామాయణం ఎపిసోడ్‌ని తనదైన శైలిలో తెరపై చూపించబోతున్నారు రాజమౌళి.
‘గతంలో తాను తీసిన సినిమాలన్నీ రామాయణం నుంచి స్ఫూర్తి పొందినవే అని, మొదటిసారి ఆ రామాయణం ఎపిసోడ్‌ని ‘వారణాసి’లో చూపిస్తున్నాను’ అంటూ రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఎపిసోడ్ 25 నిమిషాల పాటు ఉండబోతుందట. ‘వారణాసి’ చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో భాగంగా త్రేతాయుగంలో రాముడి పాత్రలో కనిపించనున్నారు మహేశ్. అదే విధంగా రుద్ర అనే సాహస వీరుడిగా మరో పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీ కోసం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్‌లో తీసిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని టాక్. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే హాలీవుడ్‌కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వారణాసి’ని తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్‌పై వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. ఈ సినిమా విడుదలయినప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ మహేశ్‌బాబు చె΄్పారంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని బట్టి చూస్తే 2025, 2026 ఏడాదిలను మహేశ్‌బాబు కూడా మిస్ అయినట్లే. ‘గుంటూరు కారం’ విడుదల తేదీ నుంచి ‘వారణాసి’ రిలీజ్ డేట్ వరకు చూస్తే మూడేళ్లకు పైగా ఆయన సినిమా కోసం ప్రేక్షకులు నిరీక్షించినట్లే లెక్క.
పైన పేర్కొన్న హీరోలే కాదు.. మరికొంత మంది కూడా 2026ని మిస్ అయ్యే అవకాశాలున్నాయి. - డేరంగుల జగన్ మోహన్


