
విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత హీరోలైన నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలానే హీరోగా కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత విలన్‌గా చేస్తున్న జాబితా కూడా పెద్దదిగానే ఉంది. కానీ ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్‌గా చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. విలన్స్‌గానూ తమ సత్తా ఏంటో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారు. ఓసారి ఆ హీరోల్లో ఉన్న విలన్‌పై ఓ లుక్ వేద్దాం...
రజనీకాంత్‌తో ఢీ: రొమాంటిక్ స్టార్ హీరో నాగార్జున విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది ‘కూలీ’ సినిమాలో చూడొచ్చు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’లో నాగార్జున ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాలో సైమన్ రోల్‌లో కనిపిస్తారు నాగార్జున. కాగా ‘కూలీ’ చిత్రీకరణప్రారంభమైనప్పుడు ఓ వ్యక్తిని నాగార్జున కిరాతకంగా చంపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది.
ఆ వీడియో బయటకు వచ్చినప్పుడే ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర, శ్రుతీహాసన్, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు చేశారు. అలాగే ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.
వెండితెర బ్రహ్మ రాక్షస: యాక్షన్ చిత్రాల్లో విలన్లను చితక్కొడుతుంటారు ప్రభాస్. ఆరడుగుల ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తుంటే, థియేటర్స్‌లో విజిల్స్ పడాల్సిందే. కానీ ఇప్పుడు తనలోని విలన్ యాంగిల్‌ని కూడా చూపించాలనుకుంటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగానే ప్రభాస్ ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా చేయనున్నారని, ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించనుందట. కానీ... ప్రభాస్ ప్రస్తుత కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది.
ఎన్టీఆర్ వార్: ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేస్తారు ఎన్టీఆర్. ‘జై లవకుశ, టెంపర్’ చిత్రాల్లో హీరోగా కనిపించడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లోనూ ప్రేక్షకులను మెప్పించారు. మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్ చేసినట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2’.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రానిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపిస్తారని, ఆ పాత్ర పేరు వీరేంద్రనాథ్ అని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ యాక్టర్స్‌గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘వార్’ (2019)కు సీక్వెల్‌గా ‘వార్ 2’ రానుంది.
హీరో... విలన్ ఒక్కరే!: అల్లు అర్జున్ ‘ఆర్య 2’ సినిమా చూశారుగా! ఆ చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఓ నెగటివ్ రోల్‌లో అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ మూడింటిలో ఒకటి విలన్ రోల్ అని, ఇప్పటివరకు అల్లు అర్జున్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా ఆయన ఈ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలోప్రారంభమైందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ ఇతర ప్రధాన హీరోయిన్ పాత్రల్లో నటిస్తారనే ప్రచారం సాగుతోంది.
బ్లాక్ స్వార్డ్: నటుడిగా కొంత గ్యాప్ తీసుకుని, ఇటీవల ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు మనోజ్. ఈ చిత్రంలో మనోజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. మరోసారి మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పేరుతో విలన్ పాత్ర చేస్తున్నారు మంచు మనోజ్. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ టీజర్ మనోజ్‌ది విలన్ పాత్ర అని స్పష్టం చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది.
మండాడిలో విలన్: తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ పాత్రను సుహాస్ చేస్తున్నారు. ఇక అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ చిత్రంలోనూ సుహాస్ విలన్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
వీరే కాదు... రానా, సందీప్ కిషన్, నవీన్ చంద్ర, ఆది పినిశెట్టి, కార్తికేయ, వరుణ్ సందేశ్ వంటి వారు ఒకవైపు హీరో పాత్రలు చేస్తూనే, కథ కుదిరినప్పుడు విలన్ పాత్రలూ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు