విక్రాంత్, చాందినీ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu). ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu)ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియాలో మాత్రమే పెళ్లవ్వగానే పిల్లలెప్పుడు అని అడుగుతారని అన్నారు. బయట ఎక్కడా కూడా ఇలా ఉండదన్నారు. అలా అడగడంతో మనపై స్ట్రెస్ ఉంటుందని తెలిపారు. అయితే పెళ్లయిన పదేళ్ల గ్యాప్ తర్వాతే పిల్లలు ప్లాన్ చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. అంతే కానీ అనవసరంగా ఒత్తిడికి గురై పిల్లల విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని యువతకు సలహా ఇచ్చారు.
శైలేష్ కొలను మాట్లాడుతూ..' నాకు 2012లో మ్యారేజ్ అయింది. నేను, మా వైఫ్ పదేళ్ల తర్వాత పిల్లలు ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. డేటింగ్ టైమ్‌లో అలా ఫిక్సయ్యాం. యంగ్‌స్టర్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. పెళ్లయ్యాక పిల్లల కోసం టైమ్ తీసుకోండి. పార్ట్‌నర్‌ను అర్థం చేసుకోండి. లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయండి. నా నిజ జీవితం నుంచే ఈ విషయం నేర్చుకున్నా. యూత్‌కు నేను ఇచ్చే సలహా కూడా ఇదే' అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
కాగా.. ఇప్పటికే రిలీజైన సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు.


