
కోలీవుడ్ స్టార్, నిర్మాత విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పలు సార్లు ఆయన పెళ్లిపై వార్లలొచ్చినా ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పెళ్లి చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన పెళ్లిపై కోలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది.
విశాల్ త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయిధన్సిక కానీ.. విశాల్ కానీ స్పందిచంలేదు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరూ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.
ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది.
ఇవాళే ప్రకటిస్తాడా?..
కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తోన్న వేళ విశాల్, సాయి ధన్షికతో వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నిజమేనని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. సోమవారం సాయంత్రం జరగనున్న సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లోనే తనతో సాయి ధన్సిక వివాహ ప్రకటన ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి.