
అవకాశాలిస్తాం.. మరి మాకేంటి? ఒకానొక దశలో ఈ మాటలు వినీవినీ విసిగిపోయానంటోంది హీరోయిన్ సుర్వీన్ చావ్లా (Surveen Chawla). కాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానంది. అయినప్పటికీ ఇండస్ట్రీలో ధైర్యంగా నిలబడ్డానంది. సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 25 నుంచి ప్రసారం కానుంది.
అసహ్యంగా అనిపించింది
ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేయాలన్నా మాకేంటి? అని చెండాలంగా మాట్లాడేవారు. ఆ పరిస్థితుల్లో నాకు బయటకు వెళ్లాలంటే కూడా అసహ్యంగా అనిపించేది. అసలు ఇవన్నీ నాకు అవసరమా? అని తిట్టుకునేదాన్ని. యాక్టింగ్ మానేయాలన్నంత కోపం వచ్చేది. వాళ్లు అడిగినదానికి ఒప్పుకోకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు చేజారాయి. చివరకు రోడ్డుమీద పడ్డట్లు అనిపించింది.
వెబ్ సిరీస్‌లతో టాప్..
ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది దీనికోసమేనా? అని నిరాశచెందేదాన్ని. నా వల్ల కాదు, సినిమాలు మానేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. సుర్వీన్ చావ్లా.. రాజు మహారాజు అనే తెలుగు మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. హిందీలో అగ్లీ, హేట్ స్టోరీ 2 వంటి మూవీస్ చేసింది. ఓటీటీలో సేక్ర్‌డ్ గేమ్స్, రానా నాయుడు, క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ వెబ్ సిరీస్‌లు చేసింది.