
తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే మహాప్రేమ. భాషతో సంబంధం లేకుండా ఏ మాత్రం బాగున్నా ఏ మూవీనైనా చూసి పడేస్తారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్నారో ఏమో గానీ కొందరు దక్షిణాది దర్శకనిర్మాతలు మనోళ్లని మరీ లైట్ తీసుకుంటున్నారే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి దాదాపు ఒకేలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఒకప్పుడు ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే తెలుగులో డబ్ చేస్తున్నారంటే కనీస జాగ్రత్తలు తీసుకునేవారు. సినిమాలో తమిళ పదాలకు బదులు తెలుగు ఉండేలా చూసుకునేవారు. టైటిల్‌తోపాటు మూవీలోని పాత్రలకు కూడా తెలుగు పేర్లే పెట్టేవారు. గత కొన్నేళ్లలో మాత్రం అలాంటిది అస్సలు పాటించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలావరకు తమిళ దర్శకనిర్మాతలు యధాతథంగా తమ టైటిల్స్ తెలుగులోనూ అలానే ఉంచేస్తున్నారు. వేట్టయాన్, పొన్నియిన్ సెల్వన్, కంగువ, మార్గన్, తుడరుమ్.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు ఉదాహరణలు.
(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))
అంతెందుకు ఇప్పుడు సూర్య కొత్త సినిమాకు 'కరుప్పు' టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి తెలుగులో నలుపు అని అర్థం. ఎంత సూర్య అయినా సరే పేరు కాస్త తెలుగులో ఉంటేనే కదా.. మూవీ జనాలకు రీచ్ అవుతుంది. అలా కాదని చెప్పి యధాతథంగా టైటిల్స్ పెట్టుకుంటే పోతే ఇది మనం చూసే సినిమా కాదేమో మనవాళ్లు లైట్ తీసుకునే అవకాశముంది. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ తీరు మార్చుకుంటారా లేదా అనేది?
సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కరుప్పు' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆన్ యాక్షన్‌తో పాటు మాస్ సీన్స్ బాగానే ఉన్నాయి. వింటేజ్ చిత్రాలైన 'గజిని', 'భాషా' సినిమాల్ని గుర్తుచేసే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయండోయ్. అంతా బాగానే ఉంది గానీ టీజర్‌లోనూ తమిళ ఫ్లేవర్ కాస్త గట్టిగానే కొట్టింది. మరి దీన్ని మన ఆడియెన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి? దీపావళికి ఈ సినిమా థియేటర్లలోకి రావొచ్చని టాక్ నడుస్తోంది.
(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)
