
ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే.. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి' అని ఏడుస్తూ తనుశ్రీ దత్తా వీడియో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో #BoycottHHVM)
బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.
అయితే 2018లో మీటూ(#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్‌కి క్లీన్ చిట్ దక్కింది. మరోవైపు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం తనని ఓ సినిమా కోసం నగ్నంగా డ్యాన్స్ చేయమని అడిగాడని గతంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: మహేశ్, సుకుమార్‌ని ఫిదా చేసిన హిందీ సినిమా.. ఏంటి దీని స్పెషల్?)