మైల్‌ స్టోన్ ముస్తాబులు | Star Heroes Ready to Celebrate Special Milestones on the Big Screen | Sakshi
Sakshi News home page

మైల్‌ స్టోన్ ముస్తాబులు

Oct 28 2026 3:09 AM | Updated on Oct 28 2026 3:09 AM

Star Heroes Ready to Celebrate Special Milestones on the Big Screen

కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ మూవీస్‌కి రెడీ అవుతున్న స్టార్‌ హీరోలు

ప్రతి హీరో తాను చేసే ప్రతి సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షతోనే స్టార్ట్‌ చేస్తారు. తమ కెరీర్‌లోని సినిమాల బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. అలాంటిది తమ కెరీర్‌లోని ‘మైల్‌ స్టోన్‌ మూవీ’ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోకమానరు. దర్శకుడు, నిర్మాణ సంస్థ, హీరోయిన్‌... ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లే... ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. కొంత సమయం గడిచినా సరే కచ్చితంగా హిట్‌ సాధించాలనే పట్టుదలతో పక్కాగా ప్లాన్‌ చేస్తుంటారు. మరి... ప్రజెంట్‌ ఏ హీరో తన కెరీర్‌లోని మైల్‌ స్టోన్‌ మూవీకి ఎలాంటి ముస్తాబులు చేస్తున్నారు? ఈ సినిమాల కోసం ఏ దర్శకులు చెప్పిన కథలను వింటున్నారు? అన్న అంశాలపై ఓ లుక్‌ వేయండి.

రజనీకాంత్‌@175 
రజనీకాంత్‌ ప్రస్తుతం ‘ధర్మన్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్‌లో ఇది 173వ సినిమా. రజనీకాంత్‌ 174వ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తారు. ఇందులో కమల్‌హాసన్‌ మరో హీరోగా నటిస్తారు. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. ఈ మల్టీస్టారర్‌ మూవీ తర్వాత రజనీకాంత్‌ చేయబోయేది ఆయన కెరీర్‌లోని 175వ సినిమా. అయితే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ తన కెరీర్‌లోని 175వ సినిమా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారు రజనీకాంత్‌. 

ఇందుకు సంబంధించిన పనులు ఆల్రెడీ మొదలయ్యాయని కోలీవుడ్‌ సమాచారం. ఇప్పటికే కార్తీక్‌ సుబ్బరాజు, అట్లీ వంటి దర్శకులు రజనీకాంత్‌కు కథలు వినిపించారట. కానీ రజనీకాంత్‌ ఇంకా ఎవర్నీ ఫైనలైజ్‌ చేయలేదని సమాచారం. మరోవైపు రజనీకాంత్‌ కెరీర్‌లోని బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘నరసింహా’కు కొనసాగింపుగా ‘నీలాంబరి: పడయప్ప 2’ అనే స్క్రిప్ట్‌ను తానే రాస్తున్నానని రజనీకాంత్‌ తన 75వ జన్మదినం సందర్భంగా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. 

దీంతో ‘నీలాంబరి: పడయప్ప 2’ ఏమైనా రజనీ కెరీర్‌లోని 175వ సినిమా అవుతుందా? అనే ఊహాగానాలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. అంతే కాదండోయ్‌... రజనీకాంత్‌ తన జీవితం గురించి ఆయనే ఓ పుస్తకం రాస్తున్నారు. ఈ విషయాన్ని రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ధ్రువీకరించారు. దీంతో ఒకవేళ రజనీకాంత్‌ బయోపిక్‌నే ఆయన కెరీర్‌లో 175వ సినిమాగా వచ్చే చాన్స్‌ లేకపోలేదనే కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది.

కింగ్‌@100 
నాగార్జున కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 100వ సినిమా ‘కింగ్‌ 100’. తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో టబు ఓ లీడ్‌ రోల్‌లో చేస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్, సుష్మితా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, తమిళ నటుడు అశోక్‌ సెల్వన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 

ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఒక సామాన్య వ్యక్తి అత్యంత సంపన్నుడిగా ఎలా ఎదిగాడు? అనేది ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందని, అలాగే తండ్రీకూతుళ్ల ఎమోషన్, ఓ ఫైనాన్షియల్‌ స్కామ్‌ నేపథ్యం కూడా ఈ చిత్రంలో ఉంటాయని ఇటీవల విడుదలైన ‘కింగ్‌ 100’ గ్లింప్స్‌ స్పష్టం చేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24న విడుదల కానుంది. ఇక ‘కింగ్‌ 100’ నాగార్జున కెరీర్‌లోని 100వ సినిమా కాబట్టి ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్స్‌ చేసి ఉంటారనే ప్రచారం వినిపిస్తోంది.  

సూర్య@ 50 
తన కెరీర్‌లోని 50వ సినిమాకు సూర్య సన్నాహాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌తో సూర్య చేసిన ‘సీన్‌’ సినిమా నవంబరు 6న విడుదల కానుంది. ఇది సూర్య కెరీర్‌లో 47వ సినిమా. తనకు ‘జై భీమ్‌’ వంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో హీరోగా సూర్య ఓ సినిమా చేయనున్నారు. ఇది ఆయన కెరీర్‌లోని 48వ సినిమా. ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సూర్య అండ్‌ టీమ్‌. 

ఇక సూర్య 49వ సినిమాకు దర్శకులుగా విక్రమ్‌ కె. కుమార్‌ (సూర్యతో ‘24’ అనే హిట్‌ సినిమాకు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించారు), మలయాళ దర్శకుడు నహాస్‌ హిదాయత్‌ వంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. తన 49వ సినిమాకు దర్శకుడు ఖరారు కాకుండానే తన 50వ సినిమా గురించి సూర్య ప్రత్యేకమైన కేర్‌ తీసుకుంటున్నారని తెలిసింది. కెరీర్‌లోని ఈ 50వ మైల్‌స్టోన్‌ మూవీ కోసం తమిళ దర్శకులు ఎస్‌. శంకర్, నెల్సన్‌ దిలీప్‌కుమార్, మారి సెల్వరాజ్‌ వంటి దర్శకులతో సూర్య సంప్రదింపులు జరుపుతున్నారని కోలీవుడ్‌ టాక్‌. సూర్య 50వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

ప్రభాస్‌@25 
ప్రభాస్‌ ప్రస్తుతం ‘ఫౌజీ, స్పిరిట్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘ఫౌజీ’ ప్రభాస్‌ కెరీర్‌లోని 24వ చిత్రం కాగా ‘స్పిరిట్‌’ చిత్రం ఆయనకు 25వ సినిమా. ఈ సినిమా కోసం ప్రభాస్‌ తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్‌ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ కూడా ఉంటాయని, కొన్ని సీన్స్‌లో ప్రభాస్‌ లెక్చరర్‌గా, మరికొన్ని సన్నివేశాల్లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని తెలిసింది.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ ఇప్పటికే దాదాపు 50 శాతం పూర్తయిందని తెలిసింది. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్‌ ఓబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

అల్లు అర్జున్‌@25 
అల్లు అర్జున్‌ తన లైనప్‌ విషయంలో ఫుల్‌ క్లారిటీతో ఉంటారు. స్క్రిప్ట్‌ విషయంలో సంతృప్తి చెందకపోతే సినిమాను సెట్స్‌ పైకి తీసుకువెళ్లరు. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ‘రాకా’ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఇది అల్లు అర్జున్‌ కెరీర్‌లోని 22వ సినిమా. ‘రాకా’ తర్వాత దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో ఓ సినిమా చేస్తారు అల్లు అర్జున్‌. 

ఇది ఆయన కెరీర్‌లోని 23వ సినిమా. ఈ ఏడాది చివర్లోనే ఈ మూవీ చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే ఏడాది చివర్లో లేదా 2028 స్టార్టింగ్‌లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉంటే...  మలయాళ దర్శక–నటుడు బాసిల్‌ జోసెఫ్‌ ఇటీవల అల్లు అర్జున్‌కు ఓ కథ వినిపించారు. అలాగే సందీప్‌ రెడ్డి వంగాతో అల్లు అర్జున్‌ కమిటైన సినిమా అనౌన్స్‌మెంట్‌ 2023 మార్చిలోనే వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ సినిమాపై ఎటువంటి అప్‌డేట్‌ లేదు. 

ఇంకా బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ‘ధురంధర్‌’ ఫేమ్‌ ఆదిత్య ధర్‌లతో కూడా కథల విషయమై అల్లు అర్జున్‌ చర్చలు జరిపారట, సంజయ్‌లీలా భన్సాలీ, సందీప్‌ రెడ్డి వంగా, ఆదిత్య ధర్, బాసిల్‌ జోసెఫ్‌... ఈ దర్శకుల్లో ఎవరు అల్లు అరున్‌  25వ సినిమాకు దర్శకుడిగా ఉంటారు? లేకపోతే ఈ నలుగురు కాకుండా వేరే దర్శకుడు ఎవరైనా టేకప్‌ చేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అలాగే అల్లు అర్జున్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరి, రాజమౌళి డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ 25వ సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.

నాగచైతన్య@25 
నాగచైతన్య కెరీర్‌లోని 24వ సినిమా ‘వృషకర్మ’ ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, వెంకీ అట్లూరి, క్లాక్స్‌ (‘బెదురులంక 2012’ ఫేమ్‌) వంటి దర్శకులు చెప్పిన కథలను విన్నారట నాగ చైతన్య. క్లాక్స్‌ చెప్పిన కథ నాగ చైతన్యకు నచ్చిందట.

 మరోవైపు తనతో ఆల్రెడీ ‘మజిలీ’ వంటి సూపర్‌ హిట్‌ సినిమా ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ వైపు కూడా నాగ చైతన్య దృష్టి పెట్టారట. ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో శివ నిర్వాణ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. వార్తల్లో ఉన్న ప్రకారం చైతూ కెరీర్‌లోని 25వ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించే చాన్స్‌ ఎక్కువగా ఉందని తెలిసింది.‘వృషకర్మ’ విడుదలైన తర్వాత నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
ఇంకా మరికొందరు హీరోలు తమ మైల్‌స్టోన్‌ మూవీకి చేరువలో ఉన్నారు.

ఒక దర్శకుడిగా వంద సినిమాల మైలురాయిని చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది సక్సెస్‌ఫుల్‌ దర్శకుల్లో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ ఒకరు. దర్శకుడిగా ప్రియదర్శన్‌ కెరీర్‌లోని వందో సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రియదర్శన్‌ దర్శకుడుగా తెరకెక్కించిన తొలి సినిమా ‘పూచక్కోరు మూక్కుతి’లో హీరోగా నటించారు మోహన్‌  లాల్‌. కాగా ప్రియదర్శన్‌   కెరీర్‌లోని వందో సినిమాలో సైతం మోహన్‌  లాల్‌నే హీరోగా నటిస్తుండటం విశేషం. ఇలా ఓ దర్శకుడి కెరీర్‌లోని తొలి సినిమాలో హీరోగా నటించిన నటుడే ఆ దర్శకుడి వందో సినిమాలోనూ హీరోగా నటించడం అనేది కచ్చితంగా అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్‌ , ఎమోషనల్‌ డ్రామా, మ్యూజిక్‌... 

ఈ అంశాలు ప్రధానంగా ఉంటూ తన వందో సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ సందర్భంలో ప్రియదర్శన్‌  పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మోహన్‌ లాల్‌–ప్రియదర్శన్‌ ల కాంబినేషన్‌లో ‘చిత్రమ్, కిలుక్కమ్, కాలపాణి, చంద్రలేఖ, ఒప్పమ్‌’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ తాజా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.  

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement