
చిన్నప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే అచ్చం మీ నాన్నలా ఉన్నాడు. కాదు.. కాదు.. అంతా మీ అమ్మ పోలికే అని తెగ పొగిడేస్తుంటారు. పసితనంలో మన పాలబుగ్గలు చూస్తే ఎవరైనా సరే ముద్దాడకుండా ఉండలేరు. మనం బాల్యంలో ఎంత ముద్దుగా ఉంటామో.. పెరిగాక అదే గ్లామర్ ఉండాలనుకోవడం కాస్తా ఎక్కువ ఆశ పడడమే అవుతుంది. కానీ కొందరు మాత్రం జిరాక్స్ తీసినట్లుగా తల్లిదండ్రుల పోలికలతో కనిపిస్తారు. అలాంటి వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా? గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల తార ముద్దుల కూతురి గురించే చర్చ.
ఈ నెల 13న అతిలోక సుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్తో హీరోయిన్ మహేశ్వరి సైతం ఆమెతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న వారిలో అచ్చం శ్రీదేవిని తలపించేలా ఉన్న అందం ఎవరైనా ఉన్నారా అంటే.. అది కేవలం ఒక్క జాన్వీ కపూర్ మాత్రమే. తాజాగా జాన్వీ కపూర్ అమ్మతో ఉన్న చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అమ్మ శ్రీదేవికి జిరాక్స్లా కనిపించే జాన్వీ కపూర్ ముద్దు ముద్దుగా.. బొద్దుగా కనిపిస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
కేవలం అమ్మలాగా ఉండటమే కాదు.. ఆమెలా అన్ని సెంటిమెంట్స్ కూడా పాటిస్తుంది. గతంలో ఇంటర్వ్యూలో చెప్పినట్లు శ్రీదేవికి అత్యంత ఇష్టమైన ప్రదేశం తిరుమల. ప్రతినెల తిరుపతికి వెళ్లేదని జాన్వీకపూర్ చాలాసార్లు చెప్పింది. తాను అమ్మలాగే ప్రతినెల తిరుమలకు వెళ్తుంటానని తెలిపింది. అమ్మ సెంటిమెంట్ను తాను గౌరవిస్తానని వెల్లడించింది. ఏదేమైనా అమ్మలా కనిపించడమే కాదు.. ఆమె ఆచారాలు, సెంటిమెంట్ను గౌరవించే కూతురు ఉండడం చాలా అరుదని చెప్పొచ్చు.
ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్ సరసన హీరోయిన్ కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి పరమ్ సుందరి మూవీలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదలవుతోంది.