
రాజమౌళి..ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు. ఇందులో నో డౌట్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా అది రికార్డులు సృష్టిస్తుంది. అలాంటి దర్శక దిగ్గజం సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా వదులుకుంటాడా? కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. నమ్మశక్యంగా లేనిఈ వార్తను బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.
న్యూస్ 18 కథనం ప్రకారం.. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం(SSMB 29)లో కీలక పాత్ర కోసం నానా పటేకర్‌ని తీసుకుందాం అనుకున్నారట. ఈ మేరకు రాజమౌళి పూణే వెళ్లి నానా పటేకర్‌కు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కథ, పాత్ర బాగున్నప్పటికీ.. దానికి నేను న్యాయం చేయలేనని నానా పటేకర్(Nana Patekar ) భావించారట. ఈ విషయం రాజమౌళి టీమ్‌కి చెప్పి.. సున్నితంగా తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది.

అంతేకాదు..ఇందులో నటించేందుకు నానా పటేకర్‌ని భారీగా పారితోషికం ఇస్తామని చెప్పారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ. 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ, నానా పటేకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాత్ర నచ్చకపోవడంతోనే నానా పటేకర్ మహేశ్ సినిమాను రిజెక్టర్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే నానా పటేకరే కాదు అమితాబ్ లాంటి స్టార్స్ కూడా నటించేందుకు ముందుకు వస్తారని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు.
రాజమౌళి- మహేశ్ సినిమా విషయానికొస్తే.. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.